Hyderabad, November 20: టాలీవుడ్ (Tollywood) కు చెందిన పలువురు సినిమా ప్రముఖుల ఇళ్లల్లో, వారి కార్యాలయాల్లో ఇన్‌కాం టాక్స్ శాఖ (Income Tax) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) ఇంట్లో మరియు ఆయనకు సంబంధించిన సురేష్ ప్రొడక్షన్ కార్యాలయం, రామానాయుడు స్టూడియోలలో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన పలు కీలక ఆధారాలు, పత్రాలు లభించినట్లు తెలుస్తుంది.
అలాగే హరిక - హసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations), సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై పలు భారీ చిత్రాలను నిర్మించిన నిర్మాత ఎస్. రాధాకృష్ణ కార్యాలయాల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో హీరో నాని (Hero Nani) కార్యాలయంలో కూడా ఐటీ దాడులు (IT Raids) జరిగాయి. ఇటీవల బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న నాని నటించిన 'జెర్సీ' చిత్రం హారిక- హసిని బ్యానర్లో రూపొందించబడిందే. కాగా, ఈ సినిమా కలెక్షన్లలో యాక్టర్ నాని పెద్ద మొత్తంలో వాటా తీసుకున్నన్నారని సమాచారం.
హీరో నాని జెర్సీ తర్వాత నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించారు, ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో "ప్రాజెక్ట్ వీ" (Project V) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నానితో పాటుగా సుధీర్ బాబు, నివేథ థామస్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.