MAA Elections 2021: ట్విస్టులతో నడుస్తున్న మా ఎన్నికలు, నిన్న బండ్ల గణేష్, నేడు సీవీఎల్‌ నరసింహారావు నామినేషన్ల ఉపసంహరణ
CVL Narasimha Rao (Photo-Twitter)

మావీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో (MAA Elections 2021) బిగ్‌ ట్విస్ట్‌ ఎదురైంది. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు సీవీఎల్‌ నరసింహారావు చివరి నిమిషం‍లో పోటీ నుంచి తప్పుకున్నారు. మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు (CVL Narasimha Rao Withdraw His Nomination ) ఆయన ప్రకటించారు.

దీని వెనుక కారణం ఉందని, రెండు రోజుల్లో మీడియా ముందుకు వచ్చి ఆ వివరాలను వెల్లడిస్తానని సీవీఎల్‌పేర్కొన్నారు. తనకు అధ్యక్ష పదవి కంటే మా సభ్యుల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తను ప్రకటించిన మేనిఫెస్టో అమలు అయ్యేందుకు చూస్తానని తెలిపారు. ఇప్పుడు పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవరికీ మద్ధతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

కాగా నిన్న బండ్లగణేశ్‌ సైతం 'మా' జనరల్ సెక్రెటరీ పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన శుక్రవారం ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకున్నారు. బండ్ల మొదట ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విభేదాలతో బయటికొచ్చారు. స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ చేశారు.

ఎవరి దారి వారిదే ఇక, విడాకులు తీసుకున్న సమంత-నాగ చైతన్య, విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని వెల్లడి

ఇదిలా ఉంటే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత బండ్ల గణేశ్‌కు లేదని నిర్మాత యలమంచిలి రవిచందర్‌ అన్నారు. గణేశ్‌ ఇప్పటికే నిర్మాతల మండలిలో సభ్యుడిగా ఉన్నారని.. ఒక సంఘంలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరో సంఘంలో పోటీ చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు బండ్ల గణేశ్‌ నామినేషన్‌ ఉపసంహరించుకోవడంపై రవిచందర్‌ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి బండ్ల గణేశ్‌ అనర్హుడు. అందుకే ఆయన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఈ విషయంపైనే ఆయన ఫిల్మ్‌ ఛాంబర్‌కు లేఖ రాశారు’ అని రవిచందర్‌ పేర్కొన్నారు.

ఈసారి జరగనున్న ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీ పదవి కోసం తాను పోటీ చేస్తున్నట్లు గత కొన్నిరోజుల క్రితం బండ్ల గణేశ్‌ ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి అదే పదవి కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్న జీవిత రాజశేఖర్‌పై పోటీ చేయడానికే తాను ఎన్నికల్లో నిల్చుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే శ్రేయోభిలాషుల సూచన మేరకు జనరల్‌ సెక్రటరీ పోటీకి నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్నానని శుక్రవారం మధ్యాహ్నం ఆయన ప్రకటించడం గమనార్హం.