తెలుగు చిత్రపరిశ్రమలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలకు (MAA Elections 2021) రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే రావడంతో వాతావరణం వేడెక్కింది. మా అధ్యక్షుడి స్థానం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ ( Prakash Raj, Manchu Vishnu, Jeevita Rajasekhar, Hema) బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ మూడు వర్గాలుగా చీలిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ మెగాస్టార్ చిరంజీవి మద్దతును సంపాదించగా, విష్ణు సూపర్‌స్టార్ కృష్ణ, రెబల్‌స్టార్ కృష్ణంరాజుల మద్దతును కూడగట్టారు.
మా ఎన్నికల్లో ముందు నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న ప్రకాశ్ రాజ్‌తన ప్యానల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27మందితో ఈ జాబితాను విడుదల చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికలను పురస్కరించుకుని ‘మా’ శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్ట కోసం.. మన నటీ నటుల బాగోగుల కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విషయాన్ని తెలియపరుస్తున్నా’అని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో సీనియర్ నటి జయసుధ, హీరో శ్రీకాంత్, యాంకర్ అనసూయ, నిర్మాత బండ్ల గణేశ్, సుడిగాలి సుధీర్ తదితరులు ఉన్నారు.
ప్రకారాజ్ ప్యానల్ సభ్యులు వీరే
1. ప్రకాశ్ రాజ్
2. జయసుధ
3. శ్రీకాంత్
4. బెనర్జీ
5. సాయికుమార్
6. తనీష్
7. ప్రగతి
8. అనసూయ
9. సన
10. అనిత చౌదరి
11. సుధ
12. అజయ్
13. నాగినీడు
14. బ్రహ్మాజీ
15. రవిప్రకాష్
16. సమీర్
17. ఉత్తేజ్
18. బండ్ల గణేష్
19. ఏడిద శ్రీరామ్
20. శివారెడ్డి
21. భూపాల్
22. టార్జాన్
23. సురేష్ కొండేటి
24. ఖయ్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవిందరావు
27. శ్రీధర్‌రావు
ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్ కన్నడ నుంచి వచ్చిన నటుడని ఆయన ‘మా’ అధ్యక్షుడేమిటనే ‘లోకల్– నాన్ లోకల్’ చర్చ తెరపైకి వచ్చింది. కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రకాశ్ రాజ్ తెలుగు నటుల సంఘానికి అధ్యక్షత వహించడం ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకాశ్ రాజ్‌కు మద్ధతుగా నిలిచారు. అతని నటన చూసి నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే నాన్ లోకల్ అనడం ఏంటని ప్రశ్నించారు.
Here's Varma Tweets
ముప్పై ఏళ్లుగా @prakashraj ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని , చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ localaa??? #MaaElections
— Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021
మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ non లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. bruce lee non local..రాముడు సీత కూడా నాన్ లోకల్ .. @prakashraaj also Non Local #MAAelections
— Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021
కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన @prakashraaj నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా ??? ఎలా ఎలా ఎలా ? #MaaElections
— Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021
'ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న ప్రకాశ్ రాజ్ నాన్ లోకలా' ? అని ప్రశ్నించారు. కర్ణాటక నించి ఏపీకి వచ్చిన ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్ అయితే,మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ లోకలా అంటూ తనదైన స్టైల్‌లో పంచుల వర్షం కురిపించారు. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్‌పై ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక చిరంజీవి తమ్ముడు నాగబాబు మా నాలుగేళ్లుగా మసకబారిపోయిందని వ్యాఖ్యలు చిత్ర సీమలో కలకలం రేపుతున్నాయి. దీనిపై మా అధ్యక్షుడు సీనియర్ నరేశ్ స్పందిస్తూ.. నాగబాబు మాకు మంచి మిత్రుడు. అతనితో అనేకసార్లు కలిసి పని చేశాను. ‘మా’తరపున మేం చేసిన చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెప్పాం. అయినా కూడా నాలుగేళ్లుగా 'మా' మసకబారిపోయిందని నాగబాబు అనడం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది’అని అన్నారు
శుక్రవారం ప్రెస్ మీట్‌లో‘మా’పై ప్రకాశ్ రాజ్, నాగబాబు చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా శనివారం ఉదయం నరేశ్ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో ‘మా’ కోసం తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.‘నాకు కథలు చెప్పడం అలవాటు లేదు. కాగితాలతో రావడమే అలవాటు. ఎవర్నో ధూషించడానికో, ఎవరిపైనో కాలు దువ్వడానికో ఈ సమావేశం పెట్టలేదు. నరేశ్ అంటే ఏంటని నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు.
ఎందుకంటే నేను సినిమా వాడిని. ‘మా’ బిడ్డను. సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ముందు ఉంది. ప్రకాశ్‌రాజ్ నాకు మంచి మిత్రుడు. ఎప్పుడో మూడు నెలల క్రితమే నాకు ఫోన్ చేసి ఈ ఏడాది ఎలక్షన్‌లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పాను. మంచు విష్ణు.. ఇండస్ట్రీ బిడ్డ.. కష్టనష్టాలు చూడకుండా సినిమాలు చేస్తూ వేలాది మందికి అన్నం పెడుతున్నారు’ అని నరేశ్ అన్నారు.