పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రాణా నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదల వాయిదా (Bheemla Nayak Release Postponed) పడింది. సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు నిర్మాతల గిల్డ్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా విడుదల చేసుకున్న మార్పులను వివరించారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ (Pawan Kalyans Bheemla Nayak) ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించారు.
అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని నిర్మాత దిల్ రాజు అభిమానులకు సూచించారు. సంక్రాంతి బరిలో రాధే శ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలు బరిలో ఉన్నాయి. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు థియేటర్ల ఇబ్బందులు, ఇతర సమస్యలను వివరించి భీమ్లానాయక్ చిత్రం రిలీజ్ డేట్‌ను వాయిదా వేసేలా నిర్మాతలను ఒప్పించినట్లు తెలుస్తున్నది.
ఇదే విషయమై దిల్ రాజు .. యూవీ వంశీ .. డీవీవీ దానయ్య ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ .. "సంక్రాంతికి 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' .. 'భీమ్లా నాయక్'ను రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' సినిమాలను మొదలుపెట్టేసి మూడేళ్లు అయింది. పైగా ఆ రెండూ కూడా పాన్ ఇండియా సినిమాలు. తెలుగుతో పాటు అదే రోజున అవి హిందీలో కూడా రిలీజ్ అవుతున్నాయి.
ఈ రెండు సినిమాలకి కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో స్క్రీన్లు కావలసి ఉంటుంది. ఉన్న థియేటర్లను మూడు సినిమాలకు కేటాయించే పరిస్థితి లేదు. ఈ విషయంపై పవన్ తోను .. 'భీమ్లా నాయక్' నిర్మాతతోను మాట్లాడటం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. 'భీమ్లా నాయక్' ను ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. నిజానికి ఆ రోజున మా 'ఎఫ్ 3' రావలసి ఉంది. 'ఎఫ్ 3' ను ఏప్రిల్ 29కి మార్చడం జరిగింది" అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.