ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL Filed Against RRR Movie) దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్ దాఖలు చేశారు.
ఇందులో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు (RRR Movie) సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ పిటిషనర్ కోరారు. సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిల్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. అయితే పిల్ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జన్ భూయాన్ బెంచ్ తెలిపింది.
ప్రజాప్రయోజన వ్యాఖ్యం కావడం వల్ల విచారణకు తీసుకొవచ్చని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ వెల్లడించింది. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్` విడుదలై నీలినీడలు నెలకొన్నాయి. ఇప్పటికే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జనవరి 7న విడుదల కావాల్సిన `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా వాయిదా పడింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా మొత్తానికే విడుదల నిలిపివేయాలని హైకోర్ట్ లో (Telangana high court) పిల్ దాఖలు కావడం `ఆర్‌ఆర్‌ఆర్` యూనిట్‌కి కొంచెం ఇబ్బందికరంగా మారింది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రానికి రాజమౌళి దర్శకుడు. ఆయన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాని నిర్మించారు. ఇందులో అలియాభట్, అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖనీ, ఒలివియా మోర్రీస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో భారీగా విడుదలకు ప్లాన్ చేశారు. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.