MAA Stir: రియల్ లైఫ్ హీరోని, తొక్కేస్తున్నారు! 'మా' ఈవెంట్‌లో నిప్పు రాజేసిన రాజశేఖర్, చిరంజీవి, మోహన్ బాబు సహా ఇతర సభ్యుల తీవ్ర అసహనం
MAA Dairy Launch Drama | Photo: Twitter

Hyderabad, January 2: మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (MAA) డైరీ ఆవిష్కరణలో వివాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో గురువారం జరుగుతున్న 'మా' న్యూ ఇయర్ డైరీ లాంచ్ (MAA New Year Diary Launch) కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణరాజు , పరుచూరి గోపాల కృష్ణ తదితర సినీ ప్రముఖులు హజరయ్యారు. కార్యక్రమంలో నటుడు రాజశేఖర్ ప్రవర్తనతో వేదికపై ఉన్న సభ్యులు తీవ్ర అసహనానికి లోనయ్యారు.

వేడుకలో చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ 'మా'లో మనలో మనకు ఎన్ని గొడవలున్నా వాటన్నింటినీ పక్కకు పెట్టి 'మా' అభివృద్ధికి తోడ్పడుదాం. మనకేం కావాలి, మన లక్ష్యాల దిశగా అడుగులేద్దాం. ఈ విషయంలో టీఎస్ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌లు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పట్ల సానుకూలంగా ఉన్నారు. కాబట్టి మనం కలిసి నడుద్దాం అంటూ చిరంజీవి మాట్లాడారు. అయితే చిరంజీవి ప్రసంగానికి మధ్యలో పదే పదే రాజశేఖర్ కమెంట్స్ చేస్తూ వచ్చారు.

తర్వాత వేదిక పైకి వచ్చిన రాజశేఖర్, పరుచూరి మాట్లాడుతుండగా మైక్ తీసేసుకొని వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు కాళ్లకు నమస్కారం చేస్తున్నా అంటూ వాళ్లకు నమస్కారం చేసి, 'చిరంజీవి గారు బ్రహాండంగా మాట్లాడారు. MAA ఎన్నికల తర్వాత నేను సినిమా కూడా చేయలేదు. MAA వల్ల నా ఫ్యామిలీలో కూడా గొడవలు వచ్చాయి, ఈ కారణం చేతనే మొన్న నా మెర్సిడెజ్ కారు కూడా ప్రమాదానికి గురైంది. అందరూ కలిసుండాలని చిరంజీవి మంచి స్పీచ్ ఇచ్చారు. కానీ, నిప్పును కప్పి ఉంచితే పొగ రాకుండా ఉండదు'. అంటూ చెప్పారు.

మధ్యలో చిరంజీవి, మోహన్ బాబు (Mohan Babu) వారిస్తుండగా ' వినండి.. మీరు మాట్లాడేటపుడు నేను విన్నా కదా, అందరి ఫ్యామిలీల్లో గొడవలున్నాయి. కానీ, మనం బయటకు రాకుండా కప్పిపుచ్చుకుంటున్నాం. మనమందరం సినిమాల్లోనే హీరోలం, కానీ రియల్ లైఫ్ లో హీరోలా ఉందామంటే తొక్కేస్తున్నారు' మళ్లీ చిరు, మోహన్ బాబు వారించగా... 'వినండి మీరు అరిచినంత మాత్రానా ఏం జరగదు ఇక్కడ, నేను మీ గురించి మాట్లాడటం లేదు' అంటూ రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారు.

దీని తర్వాత చిరంజీవి మైక్ తీసుకొని రాజశేఖర్ వ్యాఖ్యలను ఖండించారు. 'ఇదేనా సంస్కారం? మాకు విలువెక్కడ ఉంది? ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగా చేసినట్లుంది. నేనేంత సౌమ్యంగా ఉండాలనుకుంటున్నా, నాచేత కోపంగా మాట్లాడేటట్లు చేస్తున్నారు. ఇష్టం లేనపుడు రావొద్దు' అంటూ చిరంజీవి ఫైర్ అయ్యారు. ఇతడిపై 'మా' క్రమశిక్షణా కమిటీ గట్టి చర్యలు తీసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు.

గతేడాది మార్చిలో జరిగిన MAA ఎన్నికల తరువాత నరేష్, రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఆ వర్గ విబేధాలు మరోసారి ఈ ఈవెంట్ లో బయటపడ్డాయి.

ఈ నాటకీయ పరిణామాల అనంతరం రాజశేఖర్ కార్యక్రమం నుంచి వాకౌట్ చేశారు. అయితే చివరకు జీవిత రాజశేఖర్ తన భర్త తరఫున వేదిక మీద నుంచి క్షమాపణలు కోరింది. రాజశేఖర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం అని తెలిపింది. అందరితో కలిసే ముందుకు నడుస్తామని స్పష్టం చేసింది.