Chennai, Oct 29: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ గురువారం రాత్రి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో (Rajinikanth Health Update) చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఢిల్లీ నుంచి వచ్చిన రజినీ గురువారం సాయంత్రం హుటాహుటిన ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో జనరల్ చెకప్ కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు ఆయన భార్య లత వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా కావేరీ ఆసుపత్రి వైద్యులు (Kauvery Hospital) రజనీ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
చెన్నై ఆళ్వారుపేటలోని కావేరీ ఆసుపత్రిలో నిన్న చేరారని, తల తిరుగుతుండడంతో ఆయన అసౌకర్యానికి గురయ్యారని ఆ బులెటిన్ లో వివరించారు. రజనీకాంత్ ను నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలించిందని, ఆయనకు కరోటిడ్ ఆర్టెరీ రీవాస్కులరైజేషన్ ప్రక్రియ (Carotid Artery revascularization) నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ క్రమంలో నేటి ఉదయం ఆయనకు రీవాస్కులరైజేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించిన వైద్యులు.. అవసరమైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఈరోజు ఆయనకు సర్జరీ చేసినట్లు చెప్పారు. ఇక త్వరలోనే రజినీకాంత్‌ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆయన తాజాగా నటించిన ‘అన్నాత్తే’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.
70ఏళ్ల యాక్టర్ రజనీకాంత్ ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమ చలనచిత్ర అవార్డు దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును ఆయన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. ఈ అవార్డుల కార్యక్రమానికి రజనీకాంత్, ఆయన కూతురు, అల్లుడు, ఐశ్వర్య, ధనుశ్‌లతో కలిసివెళ్లారు. అవార్డు స్వీకరించిన తర్వాత రజనీకాంత్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను కలిసి తిరిగి వచ్చారు.