ఇండియాలో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ (Bollywood) కావొచ్చు కానీ, అక్కడ బాక్సాఫీస్‌ను నడిపిస్తున్నది సౌత్ సినిమానే (South Indian Cinema). తెలుగు, తమిళం, మళయాలం సినిమాలు చాలా వరకు సినిమాలు రీమేక్ (Remake) అవుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ అవుతున్న సినిమాలలో 90% సౌత్ సినిమాలే కావడం గమనార్హం. తెలుగులో వచ్చిన క్షణం, టెంపర్ సినిమాలు బాలీవుడ్‌లో భాగీ2 (Bhaagi2), సింబా (Simba)లుగా రీమేక్ అయ్యాయి. ఇవి అక్కడ 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొడితే, మరోవైపు నేరుగా వారి కథలతో తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తుస్సుమంటున్నాయి.
అర్జున్ రెడ్డి (Arjun Reddy) ని హిందీలో కబీర్ సింగ్ (Kabir Singh) గా రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సందీప్ వంగ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకప్పుడు బాలీవుడ్ లో మంచి మంచి కథలు వచ్చేవి, రానురానూ ఒకేరకమైన కథలు, పాత కథలే మళ్ళీమళ్ళీ రిపీట్ చేస్తున్నారు. కానీ సౌత్‌లో ఎప్పటికప్పుడు కొత్తకథలు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.
బాలీవుడ్‌లో చాలా కథలు రచిస్తున్నారు, కానీ అందులో ఆసక్తికరంగా అనిపించేవి చాలా తక్కువగా ఉన్నాయి. మరోవైపు సౌత్‌లో సూపర్ హిట్ అవుతున్న సినిమాల రీమేక్ హక్కులు కేవలం ఒక కోటి నుంచి రూ. 3 కోట్ల వరకు మాత్రమే దొరుకుతున్నాయి. దీంతో ఇక్కడ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కొత్త కథలు విని రిస్క్ చేయడం కంటే సౌత్‌లో వచ్చే సినిమాలే రీమేక్ చేస్తే బెటర్ ఏమో అని బలంగా నమ్ముతున్నారు. సౌత్ సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్ అవుతుండటం కూడా కారణమే అని కొందరు బాలీవుడ్ ఫిల్మ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
అయితే కొన్ని సార్లు సౌత్ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఉదాహరణకు మహేష్ బాబు దూకుడు సినిమా 'యాక్షన్ జాక్సన్' గా రీమేక్ అయింది హిందీలో ఈ సినిమాతో నిర్మాతకు రూ. 35 కోట్లు నష్టపోయాడు, అలాగే మళయాలంలో వచ్చిన 'మేరిక్కుండోరు కుంజాడు' అనే కామెడీ సినిమా బాలీవుడ్‌లో 'కమాల్ ఢమాలు మాలామాల్' పేరుతో రీమేక్ చేసి విడుదల చేశారు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అయి నిర్మాతకు రూ. 25 కోట్ల నష్టాలను ఇచ్చింది. ఇందుకు గల కారణాలు వారే చెబుతున్నారు. అవేంటంటే ఒకటి ఈ సినిమా అప్పటికే హిందీలో డబ్ అయి చాలా మంది చూసి ఉండటం, రెండు ఈ సినిమాలకు ఉండే నేటివిటీ అడ్వాంటేజ్ బాలీవుడ్‌లో పనిచేయకపోయి ఉండవచ్చు అని విశ్లేషించుకుంటున్నారు.
అయితే తెలుగులో నుంచి హిందీలో రీమేక్ అయి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు
అర్జున్ రెడ్డి - కబీర్ సింగ్
ఈ సినిమాకు బాలీవుడ్ పెద్దల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా, కొంతమంది ఇదొక పిచ్చి సినిమా అని రివ్యూలు రాసినా కబీర్ సింగ్‌కు యూత్ లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. వాహ్ ఇది సినిమా అంటే, ఇది లవ్ స్టోరీ అంటే అని నార్త్ ఇండియాలో ఈ సినిమా ఫీవర్ కొనసాగింది. హీరో షాహిద్ కపూర్ తన కెరియర్ లోనే హైఎస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన సినిమాగా కబీర్ సింగ్ నిలిచింది.
టెంపర్ - సింబా
తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ మూవీ హిందీలో సింబా పేరుతో రీమేక్ చేశారు, ఇందులో రన్‌వీర్ సింగ్ హీరోగా నటించాడు. ఈ సినిమా బాలీవుడ్‌లో కూడా సూపర్ సక్సెస్ అయింది, 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
భాగీ 2 - క్షణం
తెలుగులో అడవి శేష్ నటించిన థ్రిల్లర్ సినిమా క్షణం బాలీవుడ్‌లో భాగీ2 పేరుతో రీమేక్ అయింది, ఇది కూడా అక్కడ 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
పోకిరి - వాంటెడ్
తెలుగులో సూపర్ స్టార్ మహేష్ నటించిన పోకిరి మూవీ హిందిలో వాంటెడ్ పేరుతో రీమేక్ అయింది. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ అతనికి సూపర్ సక్సెస్ అందించిన చాలా వరకు సినిమాలు రీమేక్‌వే. తెలుగులో వాంటెడ్ తో పాటు, రవితేజ కిక్, వెంకటేశ్ బాడీగార్డ్, రామ్ పోతినేని రెడీ సినిమాలను బాలీవుడ్ లో కూడా అవే పేర్లతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు.
ఇవేకాకుండా ఒక్కడు - తేవార్, మర్యాద రామన్న - సన్ ఆఫ్ సర్ధార్, పరుగు - హీరోపంతి, విక్రమార్కుడు - రౌడీ రాథోర్ , కందిరీగ - మే తేరా హీరో పేర్లతో బాలీవుడ్‌లో రీమేక్ అయ్యాయి.