SP Balu Last Rites: కడ చూపు కోసం బారులు తీరిన అభిమానులు, తామరైపాకంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు, ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్న తమిళనాడు ప్రభుత్వం
SP Balasubrahmanyam (Photo Credits: Twitter)

Chennai, Sep 26: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు చేరుకున్న (SP Balasubrahmanyam Death) విషయం విదితమే. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు.. విదేశాల నుంచి కూడా నివాళులు అర్పించారు. నేడు తామరైపాకంలో బాలు అంత్యక్రియలు (SP Balu Last Rites) జరగనున్నాయి. కరోనా నేపథ్యంలొ పరిమిత సంఖ్యలో బంధువుల సమక్షంలో చెన్నైలోని ఆయన పార్థివ దేహానికి.. సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కరోనా నిబంధనల దృశ్యా అభిమానులు ఎవరూ రావద్దని బాలు కుటుంబసభ్యులు కోరుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు రెడ్ హిల్స్‌లో ఫామ్ హౌస్‌లో ఉంచారు. జిల్లా కలెక్టర్ దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఫామ్ హౌస్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేశామని, అభిమానులకు ప్రవేశం లేదని, దయచేసి అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.

బారికేడ్లను దాటి ఏ వాహనాన్ని కూడా అనుమతించబోమని, ప్రొటోకాల్ అధికారులకు మాత్రమే ఫామ్ హౌస్ వరకూ అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సాధ్యమైనంత తక్కువ మందికి మాత్రమే అంత్యక్రియలను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతి ఇస్తామని అన్నారు. కాగా, గత రాత్రే చెన్నైలోని కొడంబాక్కం నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో బాలూ పార్ధివదేహాన్ని, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తామరైపాక్కంకు తరలించారు.

గాన గంధర్వుడు ఇక లేరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తీవ్ర దిగ్భ్రాంతిలో అభిమాన లోకం

తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనుండగా, ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్పీ భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుమారుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు. నెల్లూరులో గానగంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాము. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని తెలిపారు.

ఆయన నెల్లూరు వాసి కావడం నెల్లూరు వ్యక్తిగా గర్వపడుతున్నాం. అన్ని భాషలలో అన్నివేల పాటలు పాడిన వ్యక్తి ఎవరూ లేరు, ఇక ఉండబోరు. బాలు కుటుంబానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తరపున ఘన నివాళి అర్పించాము' అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు కూడా ఎస్పీ బాలుకు పార్థివ దేహానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు.