SP Balasubrahmanyam (Photo Credits: Facebook)

Chennai, September 25: అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు, దాదాపు రెండు నెలల పాటు పోరాడిన ఆ గంధర్వ స్వరం తిరిగి ఆ గంధర్వ లోకానికే తరలిపోయింది. గాన గంధర్వుడిగా పేరుగాంచిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. గత నెల కరోనా బారిన పడిన బాలు, ఆగష్టు 5న ఆసుపత్రిలో చేరారు. దాదాపు 41 రోజుల పాటు ఆయన చికిత్స పొందుతూ వచ్చారు. గురువారం రాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది, బాలు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. చివరకు శుక్రవారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు బాలసుబ్రహ్మణ్యం చనిపోయారని అధికారికంగా ధృవీకరించారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుచుకుంటారు.  1946లో జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన బాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందారు. దేశ విదేశాల‌లో అనేక సంగీత క‌చేరీలు చేస్తూ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ప‌ర‌వశింప‌జేశారు.

నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అల‌రించిన బాల‌సుబ్ర‌హ్య‌ణ్యం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు.

తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. ఒక‌వైపు చ‌దువు కొన‌సాగిస్తూ ప‌లు వేదిక‌ల‌పై ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది.

కెరీర్ ప్రారంభంలో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఎక్కువ‌గా పాటలు పాడిన ఆయ‌న త‌ర్వాత దాదాపు 14 భాష‌ల‌లో త‌న గాత్రంతో అల‌రించారు. బాలులో గొప్ప‌ద‌నం ఎంటంటే చాలా మంది నటులకు , వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు. ఇక న‌టుడిగాను కొన్ని అతిథి పాత్ర‌లు పోషించారు భాలు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు.

ఇండ‌స్ట్రీకి చెందిన స్టార్ హీరోలు క‌మల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళ‌కి గాత్ర దానం చేసి అంద‌రి మెప్పు పొందారు బాలు.

సినిమాల్లోనే కాక టెలివిజన్ రంగంలో కూడా ఖ్యాతి పొందారు. పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించారు.

ఎస్పీ బాలును భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది, అనంతరం 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.