Tamil Star Suriya cries as he pays tribute to Puneeth Rajkumar (Photo-Video grab)

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబర్‌ 29 న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు సినీ, రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. కంఠీరవ స్టేడీయంలో ఆదివారం పునీత్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియల్లో తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన పలువురు అగ్ర హీరోలంతా పాల్గొన్నారు. తమిళ పరిశ్రమ నుంచి శరత్‌ కుమార్‌ అంత్యక్రియలకు హజరయ్యారు. తాజాగా పునీత్‌ సమాధిని హీరో సూర్య (Tamil Star Suriya) సందర్శించారు. అనంతరం ఆయన కటుంబ సభ్యులను పరామర్శించారు.

పునీత్‌ సమాధి దగ్గర ఆయనకు నివాళులు (he pays tribute to Puneeth Rajkumar) అర్పించిన సూర్య ఈ సందర్భంగా కన్నీటీ పర్యంతం అయ్యారు. పునీత్‌ ఇక మన మధ్యలేరనే చేదు నిజాన్ని తలచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాయల్‌ దేవ్‌రాజ్‌ అనే నటుడు ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. అయితే ఆయన అంత్యక్రియలకు రాలేని నటీనటులంతా ఆ తర్వాత స్వయంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని (Tomb of Puneet Rajkumar) దర్శించేందుకు నవంబర్ 3 నుంచి నుంచి అభిమానులకు అవకాశం కల్పించారు.

Here's Actor Kayal Devaraj  Tweet

పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన పలువురు ప్రముఖులు

ఈ నేపథ్యంలో హీరో నాగార్జున, మెగా హీరో రామ్‌ చరణ్‌లతో పాటు పలువురు నటులు బెంగళూరులోని ఆయన నివాసానికి వచ్చి పునీత్‌కు నివాళులు అర్పించారు. సోషల్‌ మీడియాలో పునీత్‌ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అక్కినేని హీరో నాగార్జున ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంగళవారం పునీత్‌ ఇంటికి వెళ్లిన ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం పునీత్‌ సోదరుడు, హీరో శివరాజ్‌కుమార్‌తో పాటు ఆయన భార్య, పిల్లలను పరామర్శించారు. శివరాజ్‌తో కాసేపు మాట్లాడి ఓదార్చారు. కాగా ఆయన అంత్యక్రియలకు మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ వెంకటేశ్‌, శ్రీకాంత్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు పలువుకు తెలుగు హీరోలు హజరైన సంగతి తెలిసిందే.

పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణించిన విషయాన్ని నమ్మలేకపోతున్నానని రామ్‌చరణ్‌ అన్నారు. బుధవారం బెంగళూరు సదాశివనగర్‌లోని పునీత్‌ రాజ్‌కుమార్‌ నివాసంలో భార్య అశ్విని, కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, పునీత్‌కు నివాళులర్పించారు. పునీత్‌ మా ఇంటికొస్తే ఆయన ముందు మేము గెస్ట్‌లాగా పీలయ్యేలా చేస్తారు. గతంలో శివరాజ్‌కుమార్‌ కూతురు వివాహానికి ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి శివన్నతో కలిసి పునీత్‌ హైదరాబాద్‌లో మా ఇంటికి వచ్చారని ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ గుర్తుచేసుకున్నారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని హీరో విశాల్‌ అన్నారు. ఆయన నటుడిగానే కాకుండా చాలా మంచి మనిషి అని తెలిపారు. ఎనిమి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పునీత్‌కు నివాళులు అర్పించిన అనంతరం విశాల్‌ మాట్లాడారు. 'పునీత్‌ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను, ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు, సమాజానికి తీరని లోటు. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పునీత్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. చివరికి తన కళ్లు కూడా దానం చేశారు. ఆయన చదివించిన 1800 పిల్లల బాధ్యత ఇకపై నేను చూసుకుంటాను. ఒక స్నేహితుడిగా పునీత్‌ సేవా కార్యక్రమాలకు నా వంతు సాయాన్ని అందిస్తానని మాటిస్తున్నాను అని విశాల్‌ పేర్కొన్నారు.

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి పట్ల అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ సంతాపం వ్యక్తం చేశారు. పుష్పక విమానం ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్‌ ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పునీత్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన మా ఇంటికి వచ్చేవారు. కలిసి భోజనం చేసేవాళ్లం. నేను బెంగళూరుకు వెళ్లినప్పుడు కలిసేవాళ్లం. ఇద్దరికి ఒకరంటే ఒకరికి గౌరవం. ఓ డ్యాన్స్‌ కార్యక్రమానికి ఇద్దరం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాం. ఎప్పుడు కలిసినా బెంగళూరు రమ్మనేవారు. అలాంటిది అకస్మాత్తుగా ఆయన లేరనే వార్త తెలిసి షాక్‌కి గురయ్యాను. పునీత్‌ గొప్ప వ్యక్తి అని, ఆయన చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని తెలిపారు.

అశేష జనవాహిని మధ్య బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం సహా అనేక మంది ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అధికారిక లాంఛనాలతో పునీత్‌ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో ఆయన సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్‌తో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు బరువెక్కిన గుండెలతో పునీత్‌ కడసారి వీడ్కోలు పలికారు. పునీత్‌ అంత్యక్రియలకు లక్షలాది అభిమానులు సహా టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కన్నడ పవర్‌ స్టార్, యువ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ నేత్రాలను నలుగురికి అమర్చి చూపును ప్రసాదించారు వైద్యులు. పునీత్‌ శుక్రవారం గుండె వైఫల్యంతో బెంగళూరులో కన్ను మూసిన విషయం విదితమే. పునీత్‌ దేహం నుంచి కళ్లను ఆ రోజే నారాయణ నేత్రాలయ వైద్యులు సేకరించారు. ఆ కళ్లను శనివారం నలుగురు యువతకు అమర్చినట్టు నేత్రాలయ చైర్మన్‌ డాక్టర్‌ భుజంగశెట్టి తెలిపారు.సోమవారం ఆయన వైద్య బృందంతో కలిసి మీడియాతో మాట్లాడారు.

సాధారణంగా రెండు కళ్లను ఇద్దరికే అమర్చుతామని, కానీ పునీత్‌ కళ్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను పై పొర, లోపలి పొరగా రెండు భాగాలుగా విభజించామని తెలిపారు. వీటిని పైపొర సమస్యతో బాధపడుతున్న ఇద్దరు యువకులకు, లోపలి పొరను ఆ సమస్య ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి అమర్చామని వివరించారు. కొత్త కంటిని శరీరం తిరస్కరించే ప్రమాదాన్ని ఇది బాగా తగ్గిస్తుందని కూడా తెలిపారు. వాడకుండా మిగిలిపోయిన తెల్లగుడ్డు భాగం ద్వారా తమ ల్యాబ్‌లో కంటి మూల కణాలను ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. ఎవరికైనా ప్రమాదాల్లో తెల్ల గుడ్డుకు గాయాలైతే ఆ కణాల ద్వారా చికిత్స చేయవచ్చన్నారు. రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులు, వారి తనయుడు పునీత్‌ కళ్లను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్‌ మాట్లాడుతూ.. ఇక నుంచి జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లలలో ట్రైనర్లకు ప్రథమ చికిత్స, ప్రత్యేక శిక్షణపై మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపారు. జిమ్‌లో వర్కవుట్స్‌ సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తామని తెలిపారు. అదే విధంగా, ట్రైనర్‌ పర్యవేక్షణ లేకుండా అధిక బరువులు ఎత్తకుండా జిమ్‌ నిర్వాహకులు చూడాలన్నారు.రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె సుధాకర్‌, పలువురు కార్డియాలజిస్ట్‌లతో సమస్యను చర్చించి మరిన్ని మార్గదర్శకాలను జారీచేస్తామని పేర్కొన్నారు.