Hyderabad, October 15: రామాయణం (Ramayana) ఆధారంగా రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా ఆదిపురుష్ (Adipurush) గురించి తాను ఏదో ఊహించుకున్నానని, కానీ టీజర్ (Teaser) తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ప్రముఖ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) అన్నారు. లైవ్, యాక్షన్ చిత్రంగా రామాయణాన్ని ఆవిష్కరిస్తారని ఆశించానని కానీ, ఇదొక యానిమేటెడ్ మూవీ అని అనుకోలేదని అన్నారు. అందుకే ఈ టీజర్ చాలామందిని నిరాశకు గురిచేసిందని అన్నారు. సినిమా విడుదలకు ముందే ఇదొక యానిమేటేడ్ సినిమా అని చెప్పి ఉంటే ఇన్ని ట్రోల్స్ వచ్చేవి కావన్నారు. ప్రేక్షకుల్ని మోసం చేస్తే ఇలాంటి రియాక్షన్సే వస్తాయని, టీజర్ చూసి తాను కూడా మోసపోయానని అన్నారు.
బాహుబలి (Bahubali) సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) నుంచి రామాయణం సినిమా వస్తోందంటే, అందులోనూ ‘తానాజీ’ దర్శకుడు దీనిని తెరకెక్కిస్తున్నారంటే భారీగానే ఊహించుకున్నట్టు చెప్పారు. ప్రేక్షకులకు కూడా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయని అన్నారు. అలాంటి సమయంలో యానిమేటెడ్ వీడియోతో వస్తే ఇలాగే ఉంటుందని విష్ణు అన్నారు. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమా టీజర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది చూసి సినీ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభాస్ లాంటి నటుడితో ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా యానిమేటెడ్ మూవీని తలపించేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో విష్ణు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తన తదుపరి చిత్రం ‘జిన్నా’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు ఈ వ్యాఖ్యలు చేశారు.