Happy Birthday Amitabh: నువ్వేమి హీరో అవుతావు పో అన్న చోటే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు, చావును జయించి వచ్చిన నటశిఖరం, అమితాబ్ జీవితంలో చీకటి కోణాలు, బెస్ట్ అనిపించే సినిమాలు మీకోసం
Memorable dialogues of Bollywood's 'Shenshaah'

Mumbai,October 10:  వయసుతో పనిలేకుండా లెజెండ్స్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ హీరోలుగానే ఉంటారు. నేటి సినిమా హీరోల్లో అలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన పర్సనాలిటీస్ లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ని ఒకరుగా చెప్పుకోవచ్చు. భారతదేశం గర్వించదగ్గ నటుల లిస్టును తీస్తే అమితాబ్ పేరు ఎప్పుడూ ముందు వరసలో ఉంటుంది. ఈ రోజు ఆయన పుట్టినరోజు (Happy Birthday Amitabh).77వ వసంతంలోకి అడుగుపెడుతున్న షెహన్‌షా (Shenshaah)జీవితం నిజంగా ఓ పడిలేచిన కెరటమే. చీదరింపులు ఉన్న చోటే సత్కార్యాలు ఉంటాయని నిరూపించిన మేరు నగధీరుడు, నువ్వు హీరోగా పనికిరావన్న చోటే జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న నట దిగ్గజం అమితాబ్ బచ్చన్. ఈ గుర్తింపు ఆయనకు అంత ఈజీగా రాలేదు. ఎన్నో పరాజయాలు, మరెన్నో అవమానాలు, అన్నీ ఎదుర్కుని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. పుట్టిన రోజు సంధర్భంగా ఆయన జీవితంపై ప్రత్యేక కథనం మీకోసం..  పుట్టిన రోజుపై అమితాబ్ సంచలన నిర్ణయం

ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ గా పనిచేయాలని ఇంటర్యూకి వెళితే అక్కడ నీ గొంతు అసలేమి బాగాలేదన్నారు. నటుడు కావాలని దర్శకుల చుట్టూ తిరిగితే నీవు నటుడిగా ఎందుకు పనికిరావు వెళ్లి ఏదైనా వేరే పనిచూసుకో అని చీదరించుకున్నారు. అయినా అమితాబ్ నిరాశపడలేదు. నటుడి కావాలనే లక్ష్యం ముందు అవన్నీ చిన్నబోయాయి. ఓటమిని అంగీకరించి పారిపోవడం కంటే గెలుపు కోసం ధైర్యంగా కడవరకూ పోరాడాలనే అనే అక్షరాలను జీవిత పాఠాలుగా మార్చుకున్నాడు. ఆ అక్షరాలే అగ్ర నటుడిగా ఆయన్ని మనముందు నిలబెట్టాయి. 1969లో సాత్ హిందూస్థానీ సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం నేటీకి విజయవంతంగా కొనసాగుతోంది.

బాల్యం

1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రయాగలో కళాకారుల ఇంట అమితాబ్ జన్మించారు. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ శ్రీవాస్తవ (బచ్చన్) హిందీ కవి. ఆయన తల్లి తేజి బచ్చన్ పంజాబీ సిక్కు మతస్థురాలు. అమితాబ్ అసలు పేరు ఇంక్విలాబ్. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదానికి ఆకర్షితులైన హరివంశ్ అమితాబ్ కు ఆ పేరు పెట్టారు. ఈ నినాదానికి తెలుగులో విప్లవం వర్ధిల్లాలి అనే అర్ధం వస్తుంది. తన స్నేహితుడు, కవి అయిన సుమిత్రానందన్ పంత్ సూచన మేరకు అమితాబ్ అని తిరిగి పేరు మార్చారు హరివంశ్. అమితాబ్ ఇంటిపేరు శ్రీవాస్తవ అయినా, హరివంశ్ కలం పేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా మారింది.

చిన్నపుడు నాటకాల్లో బాగా నటించే వారు. అదే తరువాత సినిమా నటుడిగా ఆయనకు ఎంతో ఉపయోగపడింది. సినిమా హీరో కావాలనే తపనతో కలకత్తా షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి 1968లో ముంబై వచ్చేశారు. అయితే సినిమా ఛాన్స్ అంత తేలికగా ఏమీ రాలేదు. అర్థాకలి ఆయనకు చాలా రోజులు స్వాగతం పలికింది. అయినప్పటికీ పట్టువిడవకుండా చేసిన ప్రయత్నం వల్ల ఆయనకు అనుకోకుండా కేఎ అబ్బాస్ Saat Hindustani సినిమాలో అమితాబ్ కు మొదటిసారిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినప్పటికీ అమితాబ్ గొంతు అందర్నీ ఆకర్షించింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఆనంద్ (1971), పర్వానా (1971) రేష్మా ఔర్ షేరా (1971), గుడ్దీ, బావర్చి,బాంబే టు గోవా లాంటి సినిమాల్లో విలన్ పాత్రలను పోషించారు. ఆ తర్వాత వరుసగా హిట్టు మీద హిట్టు కొట్టుకుంటూ వెళ్లారు.

మలుపు తిప్పిన జంజిర్

హీరోగా ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం డైరక్టర్ ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన జంజిర్ (1973) సినిమానే చెప్పుకోవచ్చు. విజయ్ ఖన్నా పాత్రలో యాంగ్రీ యంగ్ మాన్ ఆఫ్ ఇండియాగా ఈ చిత్రంలో నట విశ్వరూపాన్ని చూపించారు. ఆ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగానే కాకుండా, అమితాబ్ ను స్టార్ ను చేసిన సినిమా కూడా అదేనని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటునిగా మొట్టమొదటి అవార్డు దక్కింది. ఫిలింఫేర్ అమితాబ్ పెర్ఫార్మెన్సెస్ ను ఐకానిక్ గా వర్ణించింది. ఈ సినిమా తర్వాతనే జయాబచ్చన్ ను అమితాబ్ వివాహమాడారు. ఆ తర్వాత అభిమాన్ సినిమాలో వారు జంటగా తెరపై కనిపించారు. ఇక అక్కడనుంచి అమితాబ్ వెనుదిరిగి చూడలేదు. రాజేష్ ఖన్నాతో నటించిన నమక్ హరామ్ సినిమాకు మరోసారి ఉత్తమ సహాయ నటుడిగా రెండో ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో రోటీ కపడా ఔర్ మకాన్, మజ్బూర్ సినిమాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 1975లో వచ్చిన దీవార్, షోలే సినిమాలు ఆయనలోని నట విశ్వరూపాన్ని మరోసారి చూపాయి. ఆ తరువాత వచ్చిన కభీ కభీ, తండ్రి కొడుకులుగా ద్విపాత్రిభినయం చేసిన అదాలత్, 1977లో అమర్ అక్బర్ ఆంతోనియా ,సుహాగ్,మిస్టర్.నట్వర్ లాల్, కాలా పత్తర్, ది గ్రేట్ గేంబ్లర్, సిల్ సిలా, షాన్ (1980), శక్తి (1982), రాం బలరాం (1980), నసీబ్ (1981), లారిస్ (1981), సత్తే పే సత్తే, దేశ్ ప్రేమ్,మహాన్, కూలీ, 1988లో షెహెన్ షా, జాదూగర్, తూఫాన్, మే ఆజాద్ హూ,హమ్, 1990లో అగ్నిపథ్, 1992లో ఖుడా గవా, 1993లో ఇన్ సానియత్ వంటి చిత్రాల్లో నటించారు. 1990లో అగ్నిపథ్ సినిమాలో డాన్ పాత్రలో ఆయన నటనకు మొదటి జాతీయ ఉత్తమ నటుని అవార్డు లభించింది.

చీకటి ఘట్టం

1982 జూలై 26న కూలీ సినిమా కోసం బెంగుళూరు విశ్వవిద్యాలయ క్యాంపస్ లో సహనటుడు పునీత్ ఇస్సార్ తో కలసి షూటింగ్ చేస్తుండగా పేగుకు ప్రాణాంతకమైన గాయం తగిలింది[37]. మొదట ఒక టేబుల్ పై పడి, ఆక్కడి నుంచి నేలపై పడే స్టంట్ లో అమితాబ్ బల్లపైకి దూకగానే బల్ల చివరి భాగం కడుపులో గుచ్చుకు పోవడంతో లోపలి పేగు చీలిపోవడంతో రక్తస్రావం అయింది. చావుకు దగ్గరగా వెళ్ళి వెనక్కి వచ్చిన అమితాబ్ చాలా నెలలు ఆసుపత్రిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఈ సమయంలో ఆయన అభిమానులు పూజలు, ప్రార్థనలు చేసి, ఆసుపత్రి బయట ఆయనను చూడటం కోసం క్యూలలో వేచి ఉండేవారు. కోలుకున్నాకా ఒక సంవత్సరం తరువాత ఆ సినిమా చేయడం ప్రారంభించారు. 1983లో విడుదలైన ఈ సినిమా విపరీతమైన ప్రచారం వల్ల సినిమా అతి పెద్ద హిట్ అయింది. ఆ సంవత్సరంలో అతి ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. నిజానికి కూలీ సినిమా చివర్ల్ అమితాబ్ పాత్ర మరణిస్తుంది. కానీ ఈ ఘటన తరువాత దర్శకుడు మన్మోహన్ దేశాయ్ స్క్రిప్ట్ ను మార్చి, అమితాబ్ పాత్రను బతికించేశారు. ఈ విషయమై దేశాయ్ ను అడగగా నిజజీవితంలో అప్పుడే మృత్యు ఒడిలో నుండి బయటకు వచ్చిన ఆయనను సినిమాలో చంపడం తప్పు కాబట్టే స్క్రిప్ట్ మార్చానని వివరించారు. ఈ సినిమా రిలీజైన తరువాత అమితాబ్ కు దెబ్బ తగిలిన సీన్ ను ఫ్రీజ్ చేసి చూపించి, ప్రచారం చేశారు. ఆ తరువాత ఆయన నరాల బలహీనతతో బాధపడ్డారు. వ్యాధి వల్ల శారీరికంగానే కాక, మానసికంగానూ బలహీనపడ్డ అమితాబ్ సినిమాలు వదలి, రాజకీయాలలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నారు.

రాజకీయ కోణం

1984లో, అమితాబ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తమ ఫ్యామిలీ ఫ్రెండ్ రాజీవ్ గాంధీ కి మద్దతుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్.ఎన్.బహుగుణ కు వ్యతిరేకంగా అలహాబాద్ నుంచి లోక్ సభకు పోటీ నిలబడ్డారు. సాధారణ ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా 68.2శాతం ఆధిక్యంతో గెలిచారు అమితాబ్. కానీ మూడేళ్ళకే తన పదవికి రాజీనామా చేశారు. తరువాత 1988లో అమితాబ్ షెహెన్ షా సినిమాతో తిరిగి సినిమాల్లోకి వచ్చారు.

నష్టాలను మిగిల్చిన సొంత నిర్మాణం

అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎబిసిఎల్) పేరుతో 1996లో నిర్మాణ సంస్థ స్థాపించారు. కమర్షియల్ సినిమాలు తీయడం, డిస్ట్రిబ్యూషన్, ఆడియో కేసట్లు, వీడియో డిస్కులు తయారీ, అమ్మకాలు, ఈవెంట్ మేనేజ్ మెంట్, టివి సాఫ్ట్ వేర్ అమ్మకాలు చేయడం ఈ సంస్థ కార్యకలాపాలు. 1996లో ఈ సంస్థ ప్రారంభమైన తరువాత తీసిన మొదటి చిత్రం తేరే మేరే సప్నే పరాజయం పాలైంది. ఈ సినిమాతో అర్షద్ వార్సీ, దక్షిణాది నటి సిమ్రాన్ లను బాలీవుడ్ కు పరిచయం చేశారు. ఈ సంస్థ నిర్మించిన ఇతర సినిమాలు కూడా పెద్దగా హిట్ కాలేదు.

తిరిగి సినిమా రంగంలోకి

1997లో స్వంత సంస్థ నిర్మాణంలో మృత్యుదూత సినిమాతో తిరిగి నటించారు అమితాబ్. ఈ సినిమా ఆర్థికంగా పరాజయం కావడమే కాక, విమర్శకుల నుంచి వ్యతిరేకతను కూడా మూటకట్టుకున్నారు ఆయన. బెంగుళూరులో నిర్వహించిన 1996 మిస్ వరల్డ్ పోటీలకు ఎబిసిఎల్ ప్రధాన స్పాన్సర్. ఈ పోటీలు సంస్థకు భారీ నష్టాలు మిగిల్చాయి. 1998లో మియాన్ చోటే మియాన్ సినిమాతో తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా అవరేజ్ హిట్ గా నిలిచింది. సూర్యవంశం (1999) సినిమా కూడా అనుకూల సమీక్షలు అందుకుంది. కానీ 1999లో విడుదలైన లాల్ బాద్షా, హిందుస్తాన్ కీ కసమ్ సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. 2000లో యశ్ చోప్రా నిర్మించి, ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన మొహొబ్బతే సినిమాలో కసితో అమితాబ్ నటించారు. ఈ సినిమా మంచి విజయం నమోదు చేసుకుంది.ఈ సినిమాలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డ్ అందుకున్నారు. ఆ తర్వాత ఏక్ రిష్తా:ద బాండ్ ఆఫ్ లవ్ (2001), కభీ ఖుషీ కభీ గమ్ (2001), బగ్బాన్ (2003) అక్స్ (2001), ఆంఖే (2002), ఖాకే (2004), దేవ్ (2004), బ్లాక్ సినిమాలు చేశారు. బ్లాక్ సినిమాలో చెవిటి-గుడ్డి అమ్మాయికి టీచర్ పాత్రలో ప్రేక్షకులనే కాక, విమర్శకులను కూడా మెప్పించారు అమితాబ్. ఈ సినిమా కమర్షియల్ గా కూడా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన కెరీర్ లో రెండో జాతీయ ఉత్తమ నటుడు, నాల్గవ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, రెండో ఫిలింఫేర్ విమర్శకుల ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. 2005, 2006ల్లో, తన కుమారుడు అభిషేక్ బచ్చన్ తో కలసి బంటీ అవుర్ బబ్లీ (2005), కభీ అల్విదా నా కెహ్నా (2006) వంటి సినిమాల్లో నటించారు అమితాబ్. ఈ రెండు సినిమాలూ మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి.

తరువాత ఆయన నటించిన బాబుల్ (2006, ఏకలవ్య (2007), నిశ్శబ్ద్ (2007) సినిమాలు ఆర్థికంగా విజయం సాధించకపోయినా, ఈ సినిమాల్లో ఆయన నటన విమర్శకుల ప్రశంశలు అందుకున్నారు.మే 2007లో, చీనీకమ్, షూట్ అవుట్ ఎట్ లఖండ్ వాలా సినిమాల్లో నటించారు. భూత్ నాధ్, సర్కార్ రాజ్, పా వంటి సినిమాల్లో నటించారు. పా సినిమాలో ఆయన నటనకుగానూ మూడవ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, 5వ ఫిలింఫేర్ ఉత్తమ నటుని అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా 2014లో భూత్ నాథ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన భూత్ నాథ్ రిటర్న్స్ లో స్నేహపూర్వక దెయ్యంగా నటించారు. 2015లో విడుదలైన పీకు సినిమాలో దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల కోపిష్టి అయిన తండ్రి పాత్రలో నటించారు అమితాబ్. ఈ సినిమా ద్వారా నాల్గవ జాతీయ ఉత్తమ నటుడు, మూడవ విమర్శకుల ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు.

బుల్లితెర కెరీర్

2000లో, అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి (కెబిసి) మొదటి సీజన్ కు యాంకర్ గా వ్యవహరించారు. ఈ షో బ్రిటిష్ బుల్లితెర గేమ్ షో "హూ వాంట్స్ టు బి మిలీనియర్"కు భారతీయ అనుసరణ. ఈ షో చాలా పెద్ద హిట్ అయింది. 2005లో వచ్చిన రెండో సీజన్ ను అమితాబ్ అనారోగ్యం పాలవ్వడంతో 2006లో స్టార్ ప్లస్ అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. 2009లో, రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించారు. 2010లో కెబిసి నాల్గవ సీజన్ కు హోస్ట్ గా వ్య్వహరించారు. ఈ షో అయిదవ సీజన్ 2011 ఆగస్టు 15లో మొదలై, 2001 నవంబరు 17లో ముగిసింది. ఈ షో అత్యధిక టి.అర్.పి రేటింగ్స్ సాధించి చాలా పెద్ద హిట్ అయింది. సి.ఎన్.ఎన్ ఐ.బి.ఎన్ కెబిసి టీంకు, అమితాబ్ కు ఇండియన్ ఆఫ్ ద ఇయర్-ఎంటర్ టైన్మెంట్ అవార్డు ప్రదానం చేసింది. ఈ షో దాని కేటగిరీలో చాలా ఇతర అవార్డులను గెలుచుకుంది. కెబిసి-6ను కూడా అమితాబ్ హోస్ట్ చేశారు. ఈ షో 2012 సెప్టెంబరు 7న సోనీ టివిలో ప్రసారమైంది. ఈ షో అతి ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన షోగా నిలిచింది. 2014లో సోని టివిలో యుధ్ ధారావాహికలో టైటిల్ పాత్రలో నటించారు అమితాబ్. వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య నలిగే వ్యాపారవేత్త పాత్ర పోషించారు ఈ ధారావాహికలో అమితాబ్. 2010 ఫిబ్రవరి 1 నుంచి అమితాబ్ గుజరాత్ పర్యాటానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.