Hyderabad, July 23: తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ (Bigg Boss) రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే 7వ సీజన్ ప్రారంభం కానున్న విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల ఓ టీజర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఓ ప్రశ్నకు టీజర్ ద్వారా సమాధానం దొరకగా మరికొన్ని ప్రశ్నలు రేకెత్తించారు. బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యతగా మారారు. మిగిలిన నాలుగు సీజన్లకు నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించారు. అయితే.. 7వ సీజన్ నుంచి ఆయన తప్పుకున్నారు అనే వార్తలు వినిపించాయి. టీజర్ ద్వారా దీనికి సమాధానం దొరికింది. ఈ సీజన్‌కు కూడా నాగార్జున(Nagarjuna)నే వ్యాఖ్యతగా ఉండనున్నారు అనే విషయం అర్థమైపోయింది.
అయితే.. ఈ సారి సీజన్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పకుండా ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోమ్’ అనే పాటను పాడుతూ నాగార్జున టీజర్ ముగించారు. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోమ్’ అనే దానికి అర్థం ఏమై ఉంటుందనే ప్రశ్న చాలా మందిలో మెదులుతోంది. దీనికి తాజాగా సమాధానం దొరికింది.
బిగ్‌బాస్ 7 సీజన్‌కు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. ఆగస్టు చివరి వారంలో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో షో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. షో ప్రారంభానికి చాలా సమయం ఉండడంతో బిగ్‌బాస్ షైనింగ్ స్టార్ట్స్ పేరుతో ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. గత ఆరు సీజన్లలలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్‌లు ఈ వెంట్‌లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు.
ఈ ఈవెంట్‌కు సుమ యాంకర్‌గా వ్యవహరిస్తోంది. నాగార్జున ఈవెంట్‌కు రాగా.. ‘ఇటీవల బిగ్‌బాస్ 7 ప్రొమో చూశాను. అందులో కుడి ఎడమైతే పొరపాటు లేదోమ్ అని అన్నారుగా.. దానికి అర్థం ఏమిటని’ కింగ్‌ను సుమ అడుగుతుంది. ‘న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూ రూల్స్ ‘అంటూ కింగ్ సమాధానం చెప్పారు. నాగ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ సారి బిగ్‌బాస్ సీజన్ సరికొత్తగా ఉండనుందని తెలుస్తోంది. షో ఎలా ఉంటుందనేది చూడాల్సిందే. ఇక కంటెస్టెంట్లుగా ఎవరు రాబోతున్నారో అని ప్రేకక్షులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.