అద్దంకి పట్టణంలోని నాటకరంగ కళాకారుల సన్మాన కార్యక్రమానికి హాజరైన సినీ, టీవీ హాస్య నటుడు అప్పారావు (Jabardasth Appa Rao) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాటక రంగంలో సంతృప్తి, సినిమా రంగంలో ఆర్థికాభివృద్ధి లభించిందని కమెడియన్ తెలిపారు. చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ ఉండేదని అదే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిందని తెలిపారు. శుభవేళ చిత్రం ద్వారా వెండి తెరకు పరిశ్రమకు పరిచయమయ్యాయని.. ఆ తర్వాత షకలక శంకర్ ప్రోత్సాహంతో ఓ తెలుగు చానల్ కామెడీ షోలో పాత్రలు పోషించానని, ప్రాధాన్యత లేని పాత్రలు రావడంతో 6 నెలల క్రితమే తప్పుకున్నాని చెప్పారు.
ఇక విశాఖ జిల్లాలోని అక్కాయపాలెం తన స్వస్థలమని, పట్టుదలతోపాటు భార్య సహకారంతో నేను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. తన భార్య 18 ఏళ్లు టీచర్‌గా పనిచేస్తూనే ప్రోత్సాహించిందన్నారు. ఇప్పటి వరకు 250 సినిమాలు, 70 సీరియల్స్‌లో నటించినట్లు వివరించారు. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తన పాత్రకు ప్రశంసలు దక్కాయని తెలిపారు. తనకు రాని ఇంగ్లిష్ భాషతోనే అందరినీ ఆకట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సినీ రంగాన్ని ఎంచుకునే యువకులు ఏ శాఖలో ప్రతిభ ఉందో గ్రహించి శిక్షణ పొందితే విజయం సాధించవచ్చని సలహా ఇచ్చారు. ప్రతిభ ఉన్నవారిని ఎవరూ అడ్డుకోలేరని హాస్యనటుడు అప్పారావు స్పష్టం చేశారు.