 
                                                                 New Delhi, January 9: వచ్చే ఐదేళ్లలో 2024-25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల (5 Trillion Dollar Economy) లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తుందనే విశ్వాసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) వ్యక్తం చేశారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ సీనియర్ ఆర్థికవేత్తలు, ప్రైవేట్ ఈక్విటీ / వెంచర్ క్యాపిటలిస్టులు, మ్యానిఫాక్చర్ రంగం, ట్రావెల్ & టూరిజం, అపెరల్ & ఎఫ్ఎంసిజి, అనలిటిక్స్, వ్యవసాయం, సైన్స్ & టెక్నాలజీ మరియు ఫైనాన్స్ రంగాలలోని బిజినెస్ లీడర్లతో ప్రధాని సమావేశం అయ్యారు. దిల్లీలోని నీతి ఆయోగ్ (NITI AAYOG) లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బిజినెస్ లీడర్లందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఆర్థిక మందగమనం కారణంగా ఆర్థిక వ్యవస్థ కాస్త గాడి తప్పినప్పటికీ, దేశంలో అమలవుతున్న బలమైన ఆర్థిక విధానాల ద్వారా (Indian Economy) తిరిగి పుంజుకోగలదని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న యూనియన్ బడ్జెట్ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా మరియు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకునేలా ఉంటుందని మోదీ చెప్పారు.
పర్యాటకం, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తదితర రంగాలు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి మరియు ఉపాధి కల్పనకు సహాయపడే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రధాని తెలిపారు.
భారతదేశంలో అవకాశాలకు కొదవలేదు, కాబట్టి ఆ అవకాశాలను వినియోగించుకుంటూ అక్కడడక్కడా ఏర్పడే 'లోటు' ను పూడ్చుకోవడానికి మీ వంతు ప్రయతం చేయండి అని సమావేశంలో మోదీ విజ్ఞప్తి చేశారు. 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని రంగాల నుండి కేంద్రీకృత ప్రయత్నం జరగాలి. "మనమందరం కలిసి పనిచేయాలి, మనమంతా ఒక దేశం లాగా ఆలోచించడం ప్రారంభించాలి" అని ప్రధాని పేర్కొన్నారు.
ఈ సమావేశానికి హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రైల్వే మరియు వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర తోమర్ మరియు వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ హజరయ్యారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
