AP Cabinet Meeting Highlights: పోలవరం హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్టు రద్దు సహా పలు సాహసోపేత నిర్ణయాలకు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. ముఖ్యాంశాలు ఇవే!
Andhra Pradesh Cabinet Meeting Chaired by CM Jaganmohan Reddy.

Amaravathi, September 04:  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jaganmohan Reddy)  అధ్య‌క్ష‌త‌న ఈరోజు స‌చివాల‌యంలో కేబినెట్ (AP Cabinet)  సమావేశమైంది. నవయుగకు పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు, తాజా టెండర్లకు ఆహ్వానం, ఆశావర్కర్ల వేతన పెంపు, మచిలీపట్నం పోర్టుకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకుకోవడం, కొత్త ఇసుక పాలసీ తదితర కీలక నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  మంత్రివర్గ సమావేశంలో పోలవరం టెండర్ల రద్దు ఆమోదం అత్యంత కీలక నిర్ణయం. దీనికి వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేసినా, నవయుగ సంస్థ ఏపీ హైకోర్టును ఆశ్రయించినా, కేంద్ర మంత్రి కూడా పునరాలోచించుకోమని చెప్పినా సీఎం జగన్ మాత్రం తాను ముందుగా నిర్ణయించినట్లుగానే రివర్స్ టెండరింగ్ లకు పచ్చజెండా ఊపారు. ఈమేరకు కేబినేట్ ఆమోదం కూడా పొందింది.

మరో పెద్ద నిర్ణయం, ప్రభుత్వంలో ఏపియస్ ఆర్టీసీని విలీనం చేసేందుకు రాష్ట్రమంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపడం. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో "ప్రజా రవాణా శాఖ" ఏర్పాటు కానుంది. ఇన్నాళ్లు ఆర్టీసీ సంస్థకు కార్మికులుగా పనిచేసిన ఉద్యోగులు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడనున్నారు. దీనివల్ల రాష్ట్రంలో పనిచేస్తున్న 52 వేల మంది ఆర్టీసీ కార్మికులు లబ్ధిపడనున్నారు. 15రోజుల్లో దీనిపై విధివిధానాలు ఖరారుకానున్నాయి.

ఇక ఏపి కేబినేట్ ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • పోలవరం హైడెల్ పవర్ ప్రాజెక్ట్ కోసం ఇంజనీరింగ్ సంస్థతో రూ .3 వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది మరియు రివర్స్ టెండర్ ప్రక్రియలో భాగంగా కొత్త టెండర్లను ఆహ్వానించింది.
  • నవయుగ ఇంజనీరింగ్ కంపెనీతో రద్దు చేయబడిన కాంట్రాక్ట్ ఒప్పందం విలువ రూ. 3,216.11 కోట్లు. ఇదివరకే కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ .780 కోట్లు కూడా రికవరీ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • మచిలిపట్నం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని ఉపసంహరించుకునే నిర్ణయాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటివరకు అప్పజెప్పిన పనిని ప్రారంభించకపోగా, ఆ కంపెనీకి ఇచ్చిన భూమికి ఎటువంటి అద్దె చెల్లించని నేపథ్యంలో ఏపి కేబినేట్ ఈ నిర్ణయం తీసుకుంది.
  • ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (APS RTC) లోని సుమారు 52 వేల మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా తిరిగి నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక ప్రజా రవాణా శాఖను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నారు, 15 రోజుల్లో విధివిధానాలు ఖరారవుతాయి. వచ్చే మూడు నెలల్లో పూర్తి ప్రక్రియ పూర్తవుతుందని అంచనా.
  • తక్కువ ధరలకే ఇసుకను విక్రయించే కొత్త ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదించింది (ఒక టన్ను ఇసుకను రూ .375 కు విక్రయం, కిలోమీటరుకు రూ .4.90 రవాణా ఛార్జీలు అదనం). ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎమ్‌డిసి) స్టాక్ పాయింట్ల వద్ద తప్ప ఇసుక ఎక్కడ విక్రయించరాదు. ఇందుకోసం మొదటి దశలో 13 జిల్లాల్లో 41 ఇసుక స్టాక్ పాయింట్లు తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వీటి సంఖ్య 80 కి పెంచబడుతుంది.
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు ఏటా రూ .10,000 భత్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే శ్రీరామ నవమి నుంచి "వైయస్ఆర్ పెళ్లి కానుక" కార్యక్రమం కూడా అమలు చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ, మైనారిటీ వర్గాలకు చెందిన కొత్తగా పెళ్లైన జంటలకు ప్రభుత్వం తరఫున రూ. 1 లక్ష కానుకగా అందజేయబడుతుంది. నిరుపేద కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
  • తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడిపి) బోర్డు సభ్యుల సంఖ్యను 16 నుంచి 25 కి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేలా బంగారు పతక విజేతలకు రూ .5 లక్షలు, రజత పతక విజేతలకు రూ .4 లక్షలు, మరియు కాంస్య పతక విజేతలకు రూ .3 లక్షలు రివార్డ్ అందజేయనుంది ప్రభుత్వం.
  • గత ఐదేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసిన వారందరిపై నమోదైన అన్ని క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.
  • ఆంధ్రా బ్యాంక్ విలీనంపై వస్తున్న వార్తలపై కూడా ఏపి కేబినేట్ చర్చించింది. ఒకవేళ యూనియన్ బ్యాంకులో ఆంధ్రా బ్యాంకును విలీనం చేయదలుచుకుంటే, "ఆంధ్రా బ్యాంక్" పేరును మాత్రం అలాగే ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం జగన్, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసే అవకాశం ఉంది.