Andhra Pradesh: రాయల సీమ ఎడారిగా మారుతుంది అందుకే! 70వ వనమోహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్, రాష్ట్రంలో ప్రతి పౌరుడు మొక్కలు నాటాలని పిలుపు.
AP CM Jagan Mohan Reddy | File Photo.

Guntur, August 31: గుంటూరు జిల్లా, మేడికొండూరు మండ‌లం డోకిప‌ర్రులో 70వ‌ వ‌న మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ఈ భూమి మీద ప్రతి జీవికి ఆక్సిజన్ అందించే ఏకైక ప్రాణి చెట్టు అని తెలిపారు. చెట్లు పగటి పూట కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. పచ్చని చెట్లుంటేనే వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ వాయువుల సమతుల్యం ఉంటుందని అన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అడవులు అంతరించిపోతున్నాయని ఈ సందర్భంగా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి 33 శాతం అడవులు అవసరం ఉండగా రాష్ట్రంలో కేవలం 23 శాతం మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ శాతాన్ని పెంచడానికి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చెట్లను నాటడం వల్లనే అశోక చక్రవర్తి గురించి అంత గొప్పగా చెప్పుకుంటామని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ఏడాదికి ఒక పంట మాత్రమే పండుతుంది. ఆ ప్రాంతంలో 3 నెలలు మాత్రమే పంటతో భూమి అంతా పచ్చగా ఉంటుందని, మిగతా నెలలు ఎలాంటి పచ్చదనం లేకుడా నిస్సారంగా ఉంటుంది, సూర్యుని నుంచి వచ్చే కిరణాలన్నీ ఆ భూములపై వరుసగా 9 నెలల పాటు పడుతున్నాయి. ఈ కారణం చేతనే రాయలసీమ నేలలు బీడు వారి ఎడారులు మారుతున్నాయి అని చెప్పుకొచ్చారు. భూమిపై 'గ్రీన్ కవర్' ఖచ్చితంగా ఉండాలని సీఎం తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం 'గ్రీన్ కవర్' పెంచేందుకు అధిక ప్రాధాన్యమిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సీజన్ లో 25 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కనీసం 3 నుంచి 4 మొక్కలు నాటాల్సిందిగా సీఎం కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటించాలి, అన్ని కార్యాలయాలు, పారిశ్రామిక సంస్థలు వీలైనన్ని మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు కూడా చూసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. గ్రామ వాలంటీర్ల ద్వారా మొక్కల పంపిణీ చేపడతామని తెలిపారు

వాతావరణాన్ని కాలుష్యం చేసే పరిశ్రమలపై ఇక నుంచి కఠినంగా వ్యవహరిస్తామని సీఎం హెచ్చరించారు. ముఖ్యంగా ఫార్మా రంగం పరిశ్రమలతో లక్ష టన్నుల కాలుష్యం జరుగుతుంది. వాటి నుంచి విడుదలయ్యే వ్యర్థాలు కాల్చేయడం లేదా సముద్రంలో కలిపేయడం చేస్తున్నారని సీఎం తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు.

ఇటు ఆర్టీసీని కూడా ప్రక్షాళన చేయబోతున్నట్లు జగన్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేలా త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి సమకూరుస్తామని పేర్కొన్నారు. దశల వారీగా ఆర్టీసీలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు.