Amaravati, JAN 07: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఘటనలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం... హైకోర్టు రిటైర్డు జస్టిస్ బి. శేష శయనరెడ్డి (Justice B. Shesha Shayana reddy) నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. ఈ ఘటనలపై విచారణ కమిటీ విచారించనుంది. చంద్రబాబు నాయుడు డిసెంబర్ లో నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. అనంతరం జనవరి 1న గుంటూరులో జరిగిన సభలోనూ తొక్కిసలాట జరిగింది. అందులో ముగ్గురు మహిళలు మరణించారు. దాంతో చంద్రబాబు సభలకు పర్మిషన్ ఇవ్వడంపై పునరాలోచనలో పడింది ప్రభుత్వం.
అయితే ఈ ఘటనలపై రాజకీయ రచ్చ కూడా జరిగింది. పోలీసుల వైఫల్యం వల్లనే గుంటూరు తొక్కిసలాట జరిగిందని టీడీపీ ఆరోపించింది. దానికి వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టడం వల్లనే ప్రజలు చనిపోయారంటూ వైసీపీ ఆరోపించింది. దీంతో ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తునకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం హైకోర్టు రిటైర్డు జడ్జితో విచారణ కమిటీని నియమించింది. త్వరలోనే ఈ కమిటీ విచారణ చేపట్టనుంది.