Guwahati, August 17: చిన్న చిన్న కారణాలతోనే కొందరు దిద్దుకోలేని పెద్ద తప్పులను చేస్తారు. అలాంటి ఘటనే అస్సాంలో జరిగింది. ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై వేసిన రూ.500 పందెంపై మొదలైన ఓ గొడవ వ్యక్తి ప్రాణాలు తీసింది. క్షణికావేశంలో ఎదుటి వ‍్యక్తి తల నరికి చేతిలో పట్టుకుని 25 కిలోమీటర్ల దూరంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు. ఈ దారుణ సంఘటన అస్సాంలోని సొనిత్‌పుర్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫూట్‌బాల్‌ మ్యాచ్‌ ఈ గొడవకు దారి తీసింది. ఫూట్‌బాల్‌ మ్యాచ్‌కు ముందు నిందితుడు తునిరామ్‌ మాద్రిని బాధితుడు బోయిలా హెమ్‌రామ్‌ రూ.500 అ‍ప్పు అడిగాడు. అందుకు నిందితుడు నిరాకరించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత నిందితుడు బెట్‌లో ఓ మేకను గెలుచుకున్నాడు. ఆ మేకును కోసేందుకు తనతో రావాలని బోయిలా హెమ్‌రామ్‌ను కోరాడు నిందితుడు. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. తనకు రూ.500 అప్పు ఇవ్వలేదని అప్పటికే బోయిలా హెమ్‌రామ్‌న పై కోపంతో ఉన్న తునిరామ్‌ మాద్రి వేట కొడవలితో అతని తల తెగ నరికాడు. హత్య చేసిన తర్వాత అతడి తలతో ఇంటికి వెళ్లాడు నిందితుడు. అక్కడే ఉన్న అతడి సోదరుడు పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. ఆ తర్వాత 25 కిలోమీటర్ల దూరంలోని పోలీస్‌ స్టేషన్‌కు తలతో వెళ్లి లొంగిపోయాడు.