Ayodhya Ram Mandir (PIC@ANI X)

Ayodhya, JAN 18: అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రామ్‌లల్లా విగ్రహం (Ram Lalla Idol) బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ట్రక్కులో విగ్రహం రాగానే జై శ్రీరామ్‌ నినాదంతో ప్రాంగణం దద్దరిల్లింది. క్రేన్‌ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చేర్చారు. గురువారం ఆలయ గర్భగుడిలోకి (Sanctum Sanctorum) విగ్రహాన్ని తెస్తారు. కాగా, వెండితో చేసిన ఒక రామ్‌ లల్లా విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో బుధవారం ఊరేగించారు. పూజారి నెత్తిపై కలశాన్ని ఉంచుకుని ముందు నడుస్తుండగా, పూలతో అలంకరించిన పల్లకిలో ఈ వెండి విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు.

 

అంతకుముందు ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలలో భాగంగా అయోధ్యలో కలశ పూజ ఘనంగా నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌మిశ్రా దంపతులు సరయు నది ఒడ్డున దీనిని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. అనంతరం కలశాలలో సరయు నది నీటిని రామమందిరానికి తీసుకుని వెళ్లారు. కాగా, గురువారం అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి బాల రాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. దీంతో తీర్థక్షేత్ర ట్రస్ట్‌ సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్‌ దినేంద్ర దాస్‌, పూజారి సునీల్‌ దాస్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం వద్ద పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.