New Delhi, May 10: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు (Brij Bhushan) ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనపై అభియోగాలు మోపాలని (Charged With Harassment) ఆదేశించింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. అయితే ఐదు కేసుల్లో తగిన ఆధారాలు ఉన్నట్లు కోర్టు తేల్చింది. మే 21న బ్రిజ్ భూషణ్‌పై (Brij Bhushan) అభియోగాలు నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. ఆరో కేసును కొట్టివేసింది. కాగా, బ్రిజ్ భూషణ్‌పై అభియోగాలు నమోదుకు సంబంధించిన తీర్పును ఏప్రిల్ 18న ఢిల్లీ కోర్టు వెల్లడించాల్సి ఉంది. అయితే 2022 సెప్టెంబర్ 7న డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయానికి తాను హాజరైనట్లుగా వచ్చిన నివేదికలపై విచారణ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మే 7న తీర్పు వెల్లడించాలని కోర్టు నిర్ణయించింది.
మరోవైపు ఉత్తర్వుల పరిశీలన తుది దశలో ఉండటంతో మే 10న తీర్పు ప్రకటిస్తామని మే 7న కోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు శుక్రవారం తుది తీర్పు ఇచ్చింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుల్లో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా అభియోగాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.