Acharya Laxmikant Dixit Passed Away (Photo Credits: x/@PTI_News)

Lucknow, June 22: అయోధ్య‌ రామాలయంలో బాల‌రాముడికి (Ayodhya Ram Lalla) ప్రాణ ప్ర‌తిష్ట చేసిన ప్ర‌ధాన పూజారి ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్(Acharya Laxmikant Dixit) ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన వ‌య‌సు 86 ఏళ్లు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న ఆరోగ్యంగా స‌రిగా లేద‌ని కుటుంబ‌స‌భ్యులు వెల్ల‌డించారు. వార‌ణాసిలోని (Varanasi) గాంగా న‌ది తీరంలో ఉన్న మ‌ణిక‌ర్ణిక ఘాట్‌లో ఆయ‌న మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 22వ తేదీన అయోధ్య‌లో రామ్‌ల‌ల్లాను ప్ర‌తిష్టించిన విష‌యం తెలిసిందే. ఆ రోజున నిర్వ‌హించిన పూజ‌ల‌కు ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ (Acharya Laxmikant Dixit) నాయ‌కత్వం వ‌హించారు. వార‌ణాసిలో ఉన్న పండితుల్లో లక్ష్మీకాంత్ దీక్షిత్‌ను అగ్ర‌గ‌ణ్యుల‌గా భావిస్తారు.

 

వీరి స్వ‌స్థ‌లం మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్ జిల్లా. కానీ వారి కుటుంబ‌స‌భ్యులు ఎన్నో త‌రాలుగా వార‌ణాసిలోనే నివ‌సిస్తున్నారు. ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ మృతి ప‌ట్ల యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్పందించారు. త‌న ఎక్స్ పోస్టులో ఆయ‌న సంతాపం వ్య‌క్తం చేశారు. ఆచార్య ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ కాశీకి చెందిన గొప్ప పండితుడు అని, శ్రీరామ జ‌న్మ‌భూమి ప్రాణ ప్ర‌తిష్ట‌లో ఆయ‌న పాల్గొన్నార‌ని, ఆయ‌న మ‌న‌ల్ని వ‌దిలివెళ్ల‌డం.. ఆధ్యాత్మిక‌, సాహితీ ప్ర‌పంచానికి తీరని లోటు అవుతుంద‌ని సీఎం యోగి పేర్కొన్నారు.

 

సంస్కృత భాష‌కు, భార‌తీయ సంస్కృతికి ఆయ‌న చేసిన సేవ‌ల్ని ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటార‌ని సీఎం యోగి త‌న ఎక్స్ పోస్టులో వెల్ల‌డించారు. రాముడి పాదాల వ‌ద్ద ఆయ‌న‌కు చోటు ఇవ్వాల‌ని ఆ దేవున్ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. ఆయ‌న భ‌క్తుల‌కు, ఫాలోవ‌ర్ల‌కు శ‌క్తిని ఇవ్వాల‌న్ని సీఎం వేడుకున్నారు.