Merry Christmas | (Photo Credits: Pixabay)

క్రిస్మస్ పండగ వచ్చిందంటే చాలు అందరికిw ముందుగా గుర్తుకు వచ్చేది గిఫ్ట్‌లు.. ఆ తర్వాత నోరూరించే విందు భోజనాలు. విద్యుత్ వెలుగులతో జిగేల్ మనిపించే ఈ వేడుకల్లో ఆహారం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. క్రైస్తవులు ఈ పండగను జీవితంలో గుర్తుండిపోయేలా జరుపుకుంటూ ఉంటారు. టర్కీ కోడిని మొత్తం వేయించి వడ్డిస్తారు. కొందరైతే ఏకంగా ఒక గొర్రెలను కూడా గ్రిల్ చేసేస్తారు. అతిథుల కోసం ప్రత్యేకంగా డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేసి విందు భోజనాలు పెడతారు. ఈ పండగనాడు సామూహిక భోజనాలు చేయడం అనేది అనాదిగా వస్తున్న సంప్రధాయం. స్నేహితులు, బంధు మిత్రుల కోసం ప్రత్యేక వంటకాలు, వైన్ బాటిళ్లు ఇస్తూ సందడి చేస్తూ ఉంటారు. కేకులు, చికెన్ వంటకాలు,చాక్లెట్లు ఇలా రకరకాల విందులు ఈ పండగలో మనకు కనిపిస్తాయి.

బ్రిటిష్ సంప్రధాయంలో కాల్చిన మాంసం, వైన్ ప్రధానంగా ఉంటాయి. స్నేహ సంబంధాలను పెంచుకోవడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయని వారి నమ్మకం. అందుకే క్రిస్మస్ పండగకు కేక్, ఫుడ్, వైన్ ఎక్కువగా వడ్డిస్తారు. ప్రత్యేక వంటకాలు చేసి అతిథులకు అందిస్తారు, పేదలకూ పంచుతారు. అంతా కలిసి క్రిస్మస్ కేక్ తయారు చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. మన దేశంలో చికెన్, మటన్ బిర్యానీ, కూరలను ఆస్వాదిస్తారు. తరువాత కేక్, ఖీర్ వంటి స్వీట్లు ప్రధానంగా ఉంటాయి. కొబ్బరి, డ్రైఫ్రూట్స్ మధ్యలో నింపిన న్యూరియోస్, ప్రత్యేక స్వీటును స్థానికులు ఇళ్లలో తయారు చేసి అలంకరించిన బాస్కెట్లలో పెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు కార్డుతో స్నేహితులకు పంపుతారు. కుటుంబమంతా కలిసి ప్రత్యేక విందు భోజనాలు చేస్తారు. వైన్ బాటిళ్లు ఇచ్చుపుచ్చుకోవడం మరో ఆచారం. గోవాలో కాథలిక్కులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందుకే ఇక్కడ క్రిస్మస్ విందులో ప్రధానంగా చికెన్ వంటకాలు, పోర్క్, గొడ్డు మాంసం, సోర్పాటెల్, డెజర్ట్ కోసం బెబింకా వంటకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

రమ్ ఫ్రూట్ కేక్

క్రిస్మస్ వేడుకల్లో ప్రధానంగా కేక్ తయారీ ఉంటుంది. దీన్ని తయారు చేసి క్రైస్తవులు వారి స్నేహితులు,బంధువులకు అందిస్తారు. దీంట్లో రమ్ ఫ్రూట్ కేక్ ఎక్కువగా ప్రసిద్ధి పొందింది. మైదా, గుడ్లు,చక్కెర, పెథా, మార్మాలాడే, కాయలు, అల్లం మరియు సోపుతో కలిపి తయారు చేస్తారు. చాక్లెట్ కేకులు, ఫ్రూట్ కేకులు తయారు చేస్తారు.

ఫ్రూట్ కేకులు

బనానా, డబుల్‌హార్ట్‌, ఫ్రూట్‌, ఫైనాపిల్‌, చాకో, ఫ్లోర్‌లెస్‌ ఇలా రకరకాల ప్లేవర్‌ తయారు చేసిన కేకులు పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఆశ్వాధిస్తారు. ఫ్రూట్ కేక్‌ల్లో ఎండు ద్రాక్ష, ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి జీడిపప్పు పేస్ట్, వెన్న, గోడి గుడ్డు పంచదారతో మిక్స్ చేసి కేకులు తయారు చేసుకుంటారు.

స్టోలెన్ కేక్

ఇది బ్రెడ్ పండ్లు కలిపి తయారు చేస్తారు. వీటిలో ఎండిన పండ్లు, పిండి కలిసి దానికి సిట్రస్ జతచేస్తారు. మధ్యయుగపు కాలం నాటి ఈ కేక్ జర్మనీలో చాలా ప్రాచుర్యం పొందింది.

ఆఫ్రికన్ డిష్

ఈ సంప్రదాయక విందును చికెన్‌తో తయారు చేస్తారు. కారాన్ని గట్టిగా దట్టించి ఉల్లిపాయ, తేనే,వైన్‌తో చికెన్ ముక్కలు కలిపి వీటిని తయారు చేస్తారు. దీనికి ఉడికించిన గుడ్డును జోడిస్తారు.