Hyderabad, May 21: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఈరోజు ఉదయం 11.45 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో 10వ తరగతి ఫలితాలను పొందుపరిచారు. ఈసారి విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయనందున విద్యార్థి పేరు, చదివిన పాఠశాల పేరు, పుట్టిన తేదీ ఇతర వివరాలను నమోదు చేస్తే హాల్ టికెట్ నెంబర్‌తో పాటు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్ - bse.telangana.gov.in లేదా results.cgg.gov.in నుంచి మరియు ఇతర కొన్ని ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సైట్లలో కూడా తమ ఫలితాలను చూడవచ్చు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఎస్‌ఎస్‌సి పరీక్షల కోసం సుమారు 5.21 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కరోనావైరస్ కేసులలో భారీగా పెరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది, అందరూ ఉత్తీర్ణులైనట్లుగానే పేర్కొంది. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ లేదా ఎఫ్‌ఏ 1 ఆధారంగా గ్రేడ్‌లను ప్రదానం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
దీని ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తమ విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల మార్కుల ఆధారంగానే సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ గ్రేడ్లు ప్రదానం చేయనుంది. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఎఫ్‌ఏ 1లో ఇచ్చిన 20 శాతం మార్కులు గ్రేడ్ చేయబడ్డాయి. ఫలితాల్లో ఈసారి 2,10,647 మందికి 10/10 పాయింట్లు సాధించినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థుల కోసం మరొక అవకాశం కల్పిస్తూ వారి కోసం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రం కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చాక, పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సెకండరీ బోర్డ్ సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే ప్రకటించింది. మరోవైపు, 1 నుండి 9 తరగతుల విద్యార్థులందరూ పరీక్షలు లేకుండా నేరుగా పైతరగతులకు ప్రమోట్ చేయబడ్డారు.