New Delhi, March 18: భారత సైన్యంలో (Indian Army) తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు (COVID 19 Positive) నమోదైంది. లేహ్ రెజిమెంటల్ స్కౌట్స్ లోని 34 ఏళ్ల జవానుకు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ గా తేలినట్లు ఆర్మీ వర్గాలు బుధవారం ధృవీకరించాయి. లేహ్‌లోని చుహోట్ గ్రామానికి చెందిన ఈ సైనికుడు అప్పటికే ఇన్‌ఫెక్షన్ బారిన పడిన తన తండ్రితో సన్నిహితంగా మెలగడం ద్వారా అతడి నుంచి వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.
వివరాల ప్రకారం, జవాను యొక్క తండ్రి కరోనాప్రభావం తీవంగా ఉన్న ఇరాన్ పర్యటన నుంచి ఇటీవలే తిరిగివచ్చారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీని కలిసేందుకు ఆర్మీ జవాన్ కూడా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 01 వరకు సెలవుపై వెళ్లారు. మార్చి 02 తిరిగి విధుల్లో చేరారు, అయితే అప్పటికే విదేశీయాత్ర చేసి వచ్చిన సందర్భంగా తండ్రిని 'క్వారైంటైన్ పీరియడ్' లో ఉంచారు. అనంతరం జవాను తండ్రికి వైద్య పరీక్షల్లో కరోనావైరస్ పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆర్మీ జవానును కూడా మార్చి 7 ఐసోలేషన్ లోనే ఉంచారు. మార్చి 16న అతడికి పరీక్షలు నిర్వహిచగా, జవాన్ రిపోర్టులు కూడా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రస్తుతం జవాన్ కుటుంబం మొత్తం క్వారైంటైన్ లో ఉంచబడ్డారు.
ఇదిలా ఉండగా మొన్న సోమవారం రోజున, భారతదేశపు మొట్టమొదటి మహిళా మెరైన్ పైలట్‌ను కోల్‌కతాలోని హాస్పిటల్‌లో ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఈ మహిళా పైలట్‌కు జ్వరం, దగ్గు ఉంది మరియు COVID-19 యొక్క ఇతర లక్షణాలు కనిపించడంతో ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు, రిపోర్టులు రావాల్సి ఉంది.
ఇక బుధవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 147కు చేరింది. ఇప్పటివరకు కరోనావైరస్ బారినపడి దేశంలో ముగ్గురు చనిపోయారు.