
Bengaluru, November 12: రోడ్డున వచ్చిపోయే వారితో విచిత్రంగా ప్రవర్తిస్తూ, లేదా భయపెట్టిస్తూ ఆ తర్వాత ఇదంతా నిజం కాదు ప్రాంక్ అంటూ ఈ మధ్య చాలా మంది యూట్యూబర్స్ (Youtubers) ప్రాంక్ వీడియోలు (Prank Videos) చేస్తూ పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోల ట్రెండ్ ఈ మధ్య చాలా నడుస్తుంది. అయితే ఇదే క్రమంలో ప్రాంక్ వీడియోలు చేస్తున్న కొంతమందికి పోలీసులు షాక్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళ్తే, బెంగుళూరులోని యశ్వంత్ పుర (Yeswanthpur) ప్రాంతంలో సోమవారం 7 గురు స్టూడెంట్స్ కలిసి ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 'దెయ్యం ప్రాంక్' వీడియోలు చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. పూర్తిగా తెల్లటి దుస్తులు వేసుకొని, రక్తం లాగా ఎరుపు రంగు పూసుకొని, పొడవాటి గోర్లు, మొఖం కనిపించకుండా నల్లటి పొడవైన విగ్ లు పెట్టుకొని మేకప్ అయి అర్ధరాత్రి రోడ్ల మీద పడ్డారు. ఇక రోడ్డుపై నడిచేవారిని, వాహనదారులను అడ్డగిస్తూ, పేవ్ మెంట్లపై పడుకునేవారిని నిద్ర లేపుతూ వాళ్ళని భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రాంక్ వీడియోలను షూట్ చేస్తున్నారు. ఇదంతా గమనించిన కొంత మంది స్థానికులు వారిని దెయ్యం వేషధారణతో వచ్చిన దొంగలుగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అందరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
Ghost Prank Representational Video:
(This video is not of original incident, used only for representational purpose)
మేము యూట్యూబర్స్, సరదా కోసం ప్రాంక్ వీడియోస్ చేస్తున్నాము తమను వదిలేయాల్సిందిగా ప్రాధేయపడ్డారు. పోలీసులు వారి మొబైల్స్ , కెమెరాలు అన్ని చెక్ చేయగా వారి స్టోరేజ్ మొత్తం ప్రాంక్ వీడియోలతో నిండిపోయింది. దీంతో వారు దొంగలు కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ, కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించబడి ఉంది. వీరు ప్రాంక్ వీడియోలు షూట్ చేస్తున్న ప్రాంతంలో కూడా దురదృష్టవషాత్తూ 144 సెక్షన్ అమలులో ఉంది. దీంతో నిబంధనల ప్రకారం, తప్పనిసరి పరిస్థితులలో ఆ ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. దీంతో ఆ యువకుల పేరేంట్స్ పోలీసు స్టేషన్ కు వచ్చి తమ పిల్లలను విడిచిపెట్టాల్సిందిగా వేడుకున్నారు.
ఈ సందర్భంగా బెంగళూరు నార్త్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ ఆ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి ప్రాంక్ వీడియోలు సరదాకోసమే అయినా అవి ప్రజలకు కొన్నిసార్లు ప్రమాదకరంగా పరిణమిస్తాయని చెప్పారు. అర్ధరాత్రి దెయ్యాలుగా చిత్రీకరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నపుడు వారికి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని నిలదీశారు. మరోసారి ఇలాంటివి చేయకుండా పేరేంట్స్ జాగ్రత్త పడాలని చెప్పి, బెయిల్ పై విడుదల చేశారు.