Govt struggles to control onion prices as Maharashtra, Haryana elections loom large ( Photo-File Image)

Mumbai,vSeptember 29:  దేశంలో మరో రసవత్తర ఎన్నికల పోరుకు తెరలేచింది. మహారాష్ట్ర, హర్యానాలో ( Maharashtra, Haryana)ఎన్నికల మహా సమరానికి తెర లేచింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా, 24న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక నోటిఫికేషన్ రావడమే ఆలస్యం ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్-ఎన్‌సి‌పి కలిసి ముందుకెళుతుండగా...మరోవైపు గత ఎన్నికల్లో పొత్తుగా పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ-శివసేనలు మరోసారి కలిసి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మరోసారి ఉల్లి బాంబు పేలనుంది. గతంలో ఉల్లి ధర పెరిగిందంటే ప్రభుత్వాలే కూలిపోయిన ఘటనలు జరిగాయి. ఈ అంశం ఇప్పుడు కేంద్రం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి ఇది పెద్ద సవాలుగా మారింది. ఎక్కడ ఎసరు తెస్తుందోనని భయపడుతోంది.

ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో ఇప్పటికే ఆనియన్స్ కేజీ 80 రూపాయలు దాటేసింది. దీంతో మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ అధికారంలో ఉండడంతో తమ అధికార పీఠం ఎక్కడ కూలిపోతోందన్న ఆందోళనతో కేంద్రం తక్షణమే చర్యలకు ఉపక్రమించింది. ఉల్లి ధరకు కళ్లెం వేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే దేశం నుంచి ఉల్లి ఎగుమతుల్ని తక్షణమే నిలిపివేసింది. అలాగే కేంద్ర గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన 56 వేల టన్నుల ఉల్లిపాయల్లో 16 వేల టన్నుల ఉల్లిపాయల్ని తక్షణమే మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో పాటుగా కేంద్ర సంస్థలైన నాఫెడ్, జాతీయ సహకార వినియోగదారుల ఫెడరేషన్, మదర్‌ డైయిరీ సఫాల్‌ ఔట్‌లెట్స్‌ ద్వారా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కేజీ 22 నుంచి 23 రూపాయలకు అమ్ముతోంది.

ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఉల్లి ధర తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితుల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు కొత్త వ్యూహాలకు తెరలేపారు. ఇప్పటికే కేంద్రం వద్ద ఉల్లిపాయలు సరిపడా ఉన్నాయని, ఏ రాష్ట్రాలకైనా కావాలంటే తక్షణమే పంపిణీ చేస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ట్వీట్‌ చేశారు.

రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ట్వీట్‌

కాగా ఉల్లి కావాల్సిన రాష్ట్రాలకు కేజీ రూ.16 రూపాయల చొప్పున కేంద్రం సప్లయ్‌చేస్తోంది. వీటిని ఆయా రాష్ట్రాలు కిలో రూ. 24కి అమ్ముతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి మార్కెట్లో గత ఏడాది పండిన పంటనే వారు సప్లయ్‌ చేస్తున్నారు. నవంబర్‌ నాటికి కొత్త సరుకు మార్కెట్లోకి వస్తే ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా. అయితే ఈలోపే అంటే అక్టోబర్‌ లోనే ఎన్నికలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఉల్లి ధరని దింపడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఆనియన్స్ పంట ఎక్కువగా పండే రాష్ట్రాలైన కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాలు ఈ ఏడాది వర్షాలతో అతలాకుతలం అయిపోయాయి. అక్కడ సంభవించిన కుంభవృష్టి వర్షాలతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ వార్త ఇలా ఉంటే రానున్న పండగ సీజన్‌ ను పరిగణలోకి తీసుకుని కొందరు దళారులు కావాలనే స్టాక్‌ని దాచేసి కృత్రిమ కొరతను సృష్టించారన్నవాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో ఢిల్లీ, ముంబై మార్కెట్లలో ఉల్లి ధర కేజీ రూ.70–80 వరకు పలికింది. నాలుగేళ్లలో ఉల్లిధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారిని చెప్పవచ్చు. సాధారణంగా ఈ సీజన్‌లో ఉండే ధర కంటే ఇది 90శాతం ఎక్కువగా ఉంది. మరి ఉల్లి బాంబు ఏ పార్టీ మీద పడుతుందో వేచి చూడాలి.