
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 12 : దేశంలోనే మరో పెద్ద బ్యాంకు మోసం వెలుగుచూసింది. గుజరాత్‌కు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్, దాని డైరెక్టర్లు 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర మోసగించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దృష్టికి వచ్చింది. దీంతో ఏబీజీ షిప్‌యార్డ్, దాని డైరెక్టర్లు రిషి అగర్వాల్, సంతానం ముత్తుస్వామి, అశ్విని కుమార్‌పై కేసు నమోదు చేసింది. ఏబీజీ గ్రూప్ కంపెనీల్లో, ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ కీలకమైంది. గుజరాత్‌లోని దహేజ్, సూరత్‌లో దీనికి షిప్‌యార్డ్‌లున్నాయి. షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్‌లో పేరున్న ఈ కంపెనీ సుమారు 165 నౌకలను నిర్మించింది. దీంతో కంపెనీ అవసరాల నిమిత్తం ఎస్‌బీఐ నేతృత్వంలోని 28 బ్యాంకుల నుంచి కోట్లలో భారీగా రుణాలు పొందింది. అయితే ఆ నిధులను కంపెనీ అవసరాలకు వినియోగించలేదంటూ ఆరోపణలు వచ్చాయి. కంపెనీ, దాని డైరెక్టర్లు తమ సొంత లాభం కోసం బ్యాంకు నిధులను దారి మళ్లించారని, బ్యాంకులకు వాయిదాలు చెల్లించకుండా చేతులెత్తేశారని సీబీఐ తెలిపింది.
కాగా, 2019 నవంబర్ 8న ఎస్‌బీఐ తొలిసారి సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఏబీజీ షిప్‌యార్డ్ 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపించింది. ఎస్‌బీఐకు రూ.2,925 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్‌కు రూ.7,089 కోట్లు, ఐడీబీఐకి రూ.3,634 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.1,614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.1,244 కోట్లు, ఐవోబీకి రూ.1,228 కోట్లు బకాయి పడినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో అతి పెద్ద బ్యాంకు మోసంపై సీబీఐ దృష్టిసారించింది. ఈ భారీ బ్యాంకు మోసంపై ఏడాదిన్నర కాలంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ చివరకు ఈ నెల 7న ఏబీజీ షిప్‌యార్డ్, దాని డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. 28 బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర వారు మోసగించినట్లు ఆరోపించింది.