Mumbai, October 26: నవంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. పండుగల సీజన్ అవ్వడంతో నవంబర్‌లో దాదాపు 15 రోజుల పాటూ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలతో పాటూ, పండుగల కారణంగా నవంబర్ నెలలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల పనిదినాలు తగ్గనున్నాయి.
రాష్ట్రాలను బట్టి బ్యాంకు సెలవుదినాల్లో హెచ్చుతగ్గులున్నాయి. అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ సేవలకు మాత్రం ఎలాంటి అంతరాయం జరుగదని అధికారులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించిన సెలవురోజులు ఇలా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా నవంబర్ 4, నవంబర్ 5 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. దీంతో నవంబర్ నెలలో పాటూ నాలుగు ఆదివారాల్లో( నవంబర్ 7వ తేదీ, నవంబర్ 14, నవంబర్ 21, నవంబర్ 28) బ్యాంకులు పనిచేయవు. ఇక రెండో శనివారం( నవంబర్ 13), నాలుగో శనివారం( నవంబర్ 27) రోజున బ్యాంకులు పనిచేయవు. పలు రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక పండుగల కారణంగా బ్యాంకులకు అదనపు సెలవులు రానున్నాయి.
కొన్ని జిల్లాలు/సిటీల్లో ప్రత్యేకంగా బ్యాంకు సెలవుదినాలు ఉన్నాయి. ఉదాహరణకు బెంగళూరు సిటీలో నవంబర్ 1న కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా సెలవురోజు. ఇంఫాల్‌లో నవంబర్ 1న కుట్ పండుగ ఉంది. దీంతో ఇంఫాల్‌లో ఆ రోజు బ్యాంకులకు సెలవు. ఇక పాట్నా, రాంచీల్లో నవంబర్ 10న చట్‌పూజ కారణంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు.