రానున్న పండగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం భారీ బొనాంజాను అందించేందుకు సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులందరికి దసరా కానుకగా అధిక మొత్తంలో డి.ఎ 'dearness allowance (DA)' పెంపుదల చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ మేరకు 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
ఉద్యోగులకు అందించాల్సిన డి.ఎ విషయంలో ప్రతి ఆరు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం విశ్లేషణ చేపడుతుంది. ఆ తర్వాత రెండు నెలల్లో పెంచిన డి.ఎను అమలు చేస్తారు. ఈ ఏడాది జనవరిలో డి.ఎను పెంచిన ప్రభుత్వం, ఆ తర్వాత జూలైలో మరోసారి పెంచాల్సి ఉంది. అయితే కొన్ని పాలనాపరమైన కారణాల చేత డి.ఎ పెంపుదల వాయిదా పడుతూ పోతుంది. అయితే అక్టోబర్ 8 నుంచి దసరా పండుగ మొదలవుతున్న నేపథ్యంలో ఈ జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలను ఏరియర్స్ రూపంలో కలిపి, మొత్తం ఒకేసారి అక్టోబర్ లో ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం జీతంతో పాటు 12 శాతం డి.ఎ అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా మరో 5 శాతం డి.ఎ పెంపును కోరుకుంటున్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న కనీస వేతనం రూ. 18 వేల నుంచి రూ. 26 వేలకు చేరుతుంది. దీంతో ఒక్కొక్క ఉద్యోగి జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది. గతంలో 3 శాతం మాత్రమే డి.ఎ పెంచిన కేంద్రం, ఈ సారి మాత్రం వారు కోరుకుంటున్నట్లుగా 5% శాతం అంటే ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతంతో కలిపి మొత్తం జీతంలో 17 శాతం డి.ఎ అదనంగా ఇచ్చేందుకు కేంద్ర సుముఖంగా ఉన్నట్లు సమాచారం.