Islamabad, April 03: పాకిస్తాన్‌లో (Pakistan) రాజకీయాలు పీక్ స్టేజ్ కు చేరాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సిఫారసుతో జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు (dissolve Assemblies) పాక్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ (Arif Aalvi). 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికలు జరిగేవరకు ఇమ్రాన్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగనున్నారు. అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ పై (Imran Khan) అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. ఈ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. దీని వెనుక విదేశీ కుట్ర ఉందన్నారు. ఆ వెంటనే జాతినుద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్ కు సిఫారస్సు చేశారు. ఎన్నికలకు వెళ్లి ప్రజల ఆశీర్వాదం కోరుతానని ఇమ్రాన్ ప్రకటించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరగాలని, ప్రజలే భవిష్యత్‌ను నిర్ణయిస్తారన్నారు.
అంతకు ముందు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరీ (Khasim Khan suri) తిరస్కరించారు. తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. చివరి నిమిషంలో స్పీకర్ అసద్ ఖైసర్ పైనా ప్రతిపక్షాలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడంతో సూరీ సభకు అధ్యక్షత వహించారు. అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ లేరు. అదే సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడికి సిఫార్సు చేసినట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ పతనం ఖాయమైంది. అంతకంటే ముందు ఇమ్రాన్ తన తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఇస్లామాబాద్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది.
అయితే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కంటే ముందు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంలో ఓడిపోతే.. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నాయని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో వారు ఇమ్రాన్‌ను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. పాక్ రాజకీయాల్లో విదేశీ శక్తుల ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ.. తమ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పుకొచ్చారు.