Corona India: భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం,  కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు
Coronavirus test (Photo-ANI)

న్యూ ఢిల్లీ, జనవరి 29: భారత్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈమేరకు శనివారం విడుదల చేసిన Covid -19 హెల్త్ బులెటిన్ లో కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. రోజురోజుకి తగ్గుతున్న కేసుల సంఖ్యతో.. దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ 13.39%శాతానికి చేరుకోగా.. వారాంతపు పాజిటివిటీ రేటు 16.89% శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 871 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు. దింతో మహమ్మారి భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 493198కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 20,04,333 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల మధ్య 3,35,939 మంది మహమ్మారి నుంచి కోలుకోగా మొత్తం ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,83,60,710 కు చేరింది. దేశంలో రికవరీ రేటు 93.89% శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 17,59,434 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 72.57 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేపట్టారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా 165.04 కోట్ల వాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

వాక్సిన్ పంపిణీతోనే కరోనాను ధీటుగా ఎదుర్కొంటున్నట్టు ఐసీఎంఆర్ వివరించింది.  ఇక కేరళ, గుజరాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉండగా.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.