అలప్పుజ, డిసెంబర్ 19: కేరళ రాష్ట్రంలో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. అలప్పుజాలో గడిచిన పది గంటల్లో ఇద్దరు నేతలు దారుణ హత్యకు గురయ్యారు. దీంతో పోలీసులు అలర్ట్ అయి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. SDPI లీడర్ కేఎస్ ఖాన్ హత్య తర్వాత..బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాస్ ను దారుణంగా హత్య చేశారు. ఆదివారం..అతని ఇంట్లోకి చొరబడి మరీ హత్య చేశారు. మృతుడు ఓబీసీ మోర్చా కేరళ రాష్ట్ర కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
రంజిత్ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అలప్పుజా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కేఎస్ ఖాన్ పై జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మన్నన్ చేరి వద్ద ఖాన్ ప్రయాణిస్తున్న బైక్ ను కారుతో ఢీ కొట్టారు. అనంతరం అతనిపైకి దాడికి పాల్పడడంతో తీవ్రగాయాలయ్యాయి.
ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా…చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ హత్యలో ఆర్ఎస్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. అలప్పుజా జిల్లాలో 144 సెక్షన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ అలెగ్జాండర్ తెలిపారు. ఈ రెండు హత్యలపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. హత్యలను ఖండిస్తున్నట్లు సీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొంది.