(Photo-Twitter)

రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి గానూ పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. వీరిలో దేశంలో మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించిన కోవిడ్ వ్యాక్సిన్ తయారీ సంస్థల అధినేతలు సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా, భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణ, సుచిత్ర ఎల్లా దంపతులను కేంద్రం పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది.

అలాగే ఇటీవల ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్‌ను పద్మవిభూషణ్ అవార్డు కోసం ఎంపిక చేసింది. ఆయనతో పాటు ప్రభ ఆత్రే, రాధేశ్యామ్ ఖేమ్కా(మరణానంతరం), యూపీ మాజీ సీఎం కళ్యాణ్ ‌సింగ్‌(మరణానంతరం)లకు పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ అవార్డు దక్కింది. ఆజాద్‌తో పాటు మరో 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి. వీరిలో బెంగాల్‌కు చెందిన విక్టర్ బెనర్జీ, బుద్ధదేవ్ భట్టాచార్య, మహారాష్ట్రకు చెందిన నటరాజన్ చంద్రశేఖరన్, యూపీ నుంచి రషీద్ ఖాన్, వశిష్ట్ త్రిపాఠి, రాజస్థాన్‌ నుంచి దేవేంద్ర జజారియా, రాజీవ్ మెహిషి, గుజరాత్ నుంచి స్వామి సచ్చిదానంద్, ఒడిశా నుంచి ప్రతిభా రాయ్, అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు సత్యా నాదేళ్ల, సుందర్ పిచాయ్, మెక్సికో‌కు చెందిన సంజయ రాజారాం(మరణానంతరం), పంజాబ్‌ నుంచి గుర్మీత్ బావా(మరణానంతరం) ఉన్నారు.

మరో 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. పద్మశ్రీ అవార్డుల దక్కించుకున్న ప్రముఖుల్లో ఇండియాకు ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రా, నటి షాపుకారు జానకి, సోనూ నిగమ్ ఉన్నారు.