Image : (Narendra Modi/Twitter)

న్యూఢిల్లీ, జనవరి 23: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఆదివారం ఆవిష్కరించారు. హోలోగ్రామ్ విగ్రహం 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, గ్రానైట్ విగ్రహం పూర్తయ్యే వరకు అక్కడ ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతమాత వీర పుత్రుడు సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ ప్రభుత్వం ముందు తాను స్వాతంత్య్రం కోసం అడుక్కోనని, దాన్ని సాధించుకుంటానని గర్వంగా చెప్పారని అన్నారు. “నేతాజీ స్వేచ్ఛా భారతదేశానికి హామీ ఇచ్చారు. ఆయన డిజిటల్ విగ్రహం స్థానంలో త్వరలో భారీ విగ్రహం రానుంది. ఈ విగ్రహం స్వాతంత్ర మహానాయకుడికి కృతజ్ఞతతో కూడిన జాతికి నివాళి. ఈ విగ్రహం మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకు గానూ ‘సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్’ను కూడా అందించారు. మొత్తం 7 అవార్డులను ప్రధాని అందజేశారు.