Image used for representational purpose only | (Photo Credits: Twitter)

లాహోర్, జనవరి 29: ఆన్ లైన్లో పబ్జీకి బానిసైన ఓ బాలుడు తన కుటుంబ సభ్యులనే కడతేర్చాడు. పబ్జీ ఆడనివ్వడం లేదని తల్లితో పాటు.. సోదరుడు, ఇద్దరు సోదరీమణులను బాలుడు కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్ లోని లాహోర్ లో కహ్నాలో వెలుగు చూసింది. కహ్నా ప్రాంతానికి చెందిన నహిద్ ముబారక్ (45) కొన్నేళ్ల క్రితమే భర్త నుంచి విడిపోయి.. తన పిల్లలతో కలిసి ఉంటోంది. స్థానికంగా హెల్త్ వర్కర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమెకు తైమూర్ (22), 17,11 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లతో పాటు.. మరో మైనర్ బాలుడు ఉన్నారు. చిన్న కొడుకు పబ్జీకి బానిసయ్యాడు. గేమ్ ఆడవద్దని తల్లి పలుమార్లు మందలించినా.. అతని ప్రవర్తనలో మార్పు లేదు. ఇదే విషయంపై కుమారుడి మీద నహిద్‌ మళ్లీ కోపం ప్రదర్శించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు కప్‌బోర్డులోని తుపాకీ తీసుకొని తల్లితోపాటు సోదరుడు, ఇద్దరు సోదరీమణులను కాల్చి చంపాడు.

ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను ఎవరో కాల్చిచంపారంటూ.. పొరిగింటి వారికి చెప్పాడు. వారు పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఎలా జరిగిందని బాలుడిని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని, ఇది జరిగినపుడు తాను ఇంటిపైన ఉన్నానని తెలిపాడు. బాలుడి ప్రవర్తనలో తేడా గమనించిన పోలీసులు.. కాస్త గట్టిగా విచారించగా.. అసలు నిజం బయటపెట్టాడు. హత్య చేసిన తర్వాత తుపాకీని మురికి కాలువలో పడేసినట్లు తెలిపాడు. కాగా.. ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ కు బానిస అవ్వడంతో.. బాలుడి మానసిక పరిస్థితి సరిగ్గాలేదని పోలీసులు తెలిపారు.