ED Raides In Punjab: పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు, ఎన్నికల వేళ కుట్ర అని తోసిపుచ్చిన కాంగ్రెస్...
Charanjit Singh Channi (Photo Credit: Facebook)

పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. మేనల్లుడుపై అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేపట్టింది. పలు కేసులు నమోదు చేసిన ఈడీ సీఎం చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ ఇంటితో పాటు పంజాబ్‌లోని మరో 10 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ సోదాలు జరిగాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం మేనల్లుడి ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తిస్తోంది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఈడీ భూపిందర్ సింగ్ హనీపై కేసు నమోదు చేసింది. భూపిందర్ సింగ్ పై ఈడీ దాడులపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలోనే దాడులు చేయటం ఇది బీజేపీ కుట్ర అని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ను ఎన్నికల్లో దెబ్బ తీయటానికే కేంద్రప్రభుత్వం కావాలనే ఈ ఆరోపణలు చేస్తు అక్రమ కేసులు బనాయిస్తోంది ఆరోపిస్తోంది కాంగ్రెస్. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి రాజకీయ సంబంధాలు ఉన్న పలువురిని విచారిస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే పంజాబ్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న క్రమంలో ఈ అక్రమ ఇసుక తవ్వకాలు చర్చనీయాంశమైంది. అధికార కాంగ్రెస్‌కు వ్యాపారాలతో సంబంధాలున్నాయని మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు. అమరీందర్ గత సెప్టెంబరులో సీఎం పదవి నుండి తొలగించబడిన విషయం తెలిసిందే. అలా కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పై పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపు అందరు ఇసుక అక్రమ వ్యాపారంలో ఉన్నారని ఆరోపణలు చేశారు. ఇసుక అక్రమ వ్యాపారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారని తాను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలిపాననే విషయాన్ని కూడా అమరీందర్ సింగ్ తెలిపారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు గట్టి సవాల్‌గా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం చన్నీని తన నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలపై కూడా లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు చేసింది. ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనున్న పంజాబ్‌లో తీవ్రమైన ప్రచారానికి మధ్యలో ఈ దాడులు జరిగాయి. ఫలితాలు మార్చి 10న ప్రకటించబడతాయి.