Genome Sequencing:ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎలా గుర్తిస్తారు? అసలు జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి?, దాన్ని ఎలా చేస్తారు? జీనోమ్ సీక్వెన్సింగ్ గురించి మరిన్ని వివరాలు
ఒమిక్రాన్(Omicron) వ్యాప్తిని గుర్తించి దాన్ని కట్టడి చేసి కొత్త ఉత్పరివర్తనాలను గుర్తించడంలో జీనోమ్ సీక్వెన్సింగ్‌దే కీలక పాత్ర. గతంలో కొవిడ్ స్ట్రెయిన్లతో పాటు సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా(Delta variant) రకాన్ని కూడా ఇదే పద్ధతిలో గుర్తించారు
New Delhi December 25: విదేశాల నుంచి వచ్చేవారికి కొవిడ్ -19(Covid-19) పాజిటివ్‌గా తేలితే వారి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. దీంతో జీనోమ్ సీక్వెన్సింగ్(genome sequencing) పరీక్షలు పెరిగాయి. కేవలం విదేశాల నుంచి వచ్చినవారివి మాత్రమే కాకుండా...కరోనా పాజిటివ్ వచ్చిన వారందరి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్(genome sequencing) ల్యాబ్‌కు పంపుతామని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు ఒక వైరస్‌లో వివిధ వేరియంట్లను పరిశోధకులు ఎలా గుర్తిస్తారన్న ప్రశ్న చాలా మందికి కలిగే ఉంటుంది.
ఒమిక్రాన్(Omicron) వ్యాప్తిని గుర్తించి దాన్ని కట్టడి చేసి కొత్త ఉత్పరివర్తనాలను గుర్తించడంలో జీనోమ్ సీక్వెన్సింగ్‌దే కీలక పాత్ర. గతంలో కొవిడ్ స్ట్రెయిన్లతో పాటు సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా(Delta variant) రకాన్ని కూడా ఇదే పద్ధతిలో గుర్తించారు. అసలు జీనోమ్ సీక్వెన్సింగ్ ఎలా చేస్తారు? వేరియెంట్లను గుర్తించడంలో ఇది ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.
RNA అణువు నుంచి జన్యుపరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగపడే సాంకేతిక ప్రక్రియే జీనోమ్ సీక్వెన్సింగ్(genome sequencing). వైరస్ రకం, ఉత్పరివర్తనాలు (Mutations), ఏ పద్ధతిలో మనుషులపై దాడి చేస్తుంది? ఎలా వ్యాప్తి చెందుతుంది? తదితర కీలక సమాచారాన్ని తెలుపుతుంది. ఈ సాంకేతికత అర్థం కావాలంటే శరీరంలో వైరస్ సంక్రమణ ఎలా జరుగుతుందో తొలుత తెలియాలి. డీఎన్‌ఏ అణువులతో మనిషి శరీరం నిర్మితమైనట్టే వైరస్ కూడా డీఎన్‌ఏ (DNA) లేదా ఆర్‌ఎన్‌ఏ రూపంలో ఏర్పడుతుంది.
కరోనా ఆర్‌ఎన్‌ఏతో ఏర్పడినదే ఈ వైరస్(Virus). వీటిలో మ్యుటేషన్లను గుర్తించేందుకు పరిశోధకులు కరోనా సోకిన వారి నుంచి నమూనాలను సేకరిస్తారు. తర్వాత దాన్ని ‘జీనోమ్ సీక్వెన్సింగ్ (genome sequencing)’ అనే పద్ధతి ద్వారా పరిశీలిస్తారు. ఆ నమూనాని బీఎస్‌ఎల్ 3 ల్యాబ్ (BSL-3 LAB)కు పరీక్ష కోసం తరలిస్తారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఆ శాంపిల్స్ నుంచి ఆర్‌ఎన్‌ఏని సంగ్రహించి అది డీగ్రేడ్ కాకుండా ఉండేలా మైనస్ 80డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద ఉంచుతారు. ల్యాబ్‌లో ఆర్‌ఎన్‌ఏని ప్రాసెస్ చేసి డీఎన్‌ఏగా మారుస్తారు.
డీఎన్‌ఏతో పోలిస్తే ఆర్‌ఎన్‌ఏ(RNA) అత్యంత అస్థిరతతో కూడినది గనక డీఎన్‌ఏగా మారిస్తే శాంపిల్ సమాచారాన్ని స్థిరంగా ఉంచగలుగుతుంది. డీఎన్‌ఏని ఫ్రాగ్మెంటేషన్‌కు పంపే ముందు పీసీఆర్ ఆంప్లిఫికేషన్లో ఉంచుతారు. డీఎన్‌ఏ చాలా పొడుగ్గా ఉన్నందున సీక్వెన్సింగ్ చేసేందుకు దాన్ని ముక్కలుగా విభజించి ట్యాగ్ చేస్తారు. ఈ శాంపిల్ పరిమాణం, నాణ్యతను పరీక్షించేందుకు ఓ యంత్రంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత సిద్ధంగా ఉన్న శాంపిల్స్‌ని డీఎన్‌ఏ జన్యుక్రమాన్ని గుర్తించే యంత్రంలోకి పంపగా అది వివిధ రసాయనాలతో మిళితమవుతుంది. తద్వారా ఆ నమూనాల న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ ఈ వైరస్ ఏ రకానికి చెందినదో నిర్ధారిస్తుంది.
(The above story first appeared on LatestLY on Dec 26, 2021 12:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

