Booster Dose: బూస్టర్ డోసులపై ప్రధాని కీలక ప్రకటన, జనవరి 10 నుంచి ఫ్రంట్‌ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోసు, త్వరలోనే చిన్నారులకు వ్యాక్సినేషన్‌
PM Modi

New Delhi December 25: బూస్టర్ డోసు(Booster Dose), చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌(Child vaccination) పై కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్రమోడీ. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనవరి 10వ తేదీ నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల(frontline workers)కు బూస్టర్‌ డోసు అందిస్తామని ప్రకటించారు. జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికీ టీకా పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ జాతినుద్దేశించి(Modi Address nation) ప్రసంగించారు.

‘‘దేశంలో 90 శాతం వయోజనులకు కొవిడ్ టీకా తొలి డోసు పంపిణీ పూర్తయింది. ఒమిక్రాన్‌(Omicron)పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వడివడిగా సాగుతోంది. దేశంలో కరోనా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదు’’ అని మోడీ అన్నారు.

మన దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ అందరం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒమిక్రాన్‌ వస్తోందని ఎవరూ భయాందోళనకు గురికావొద్దన్నారు. ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. ఇవాళ దేశవ్యాప్తంగా 18 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. పిల్లలకు 90వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశంలో ఔషధాలకు ఎలాంటి కొరతా లేదని చెప్పారు.

 

ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు అని మోదీ చెప్పారు. అనేక రాష్ట్రాల్లో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. కొత్త సంవత్సరం కోసం అంతా ఆతృతతో ఎదురుచూస్తున్నాం.. కానీ ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని అన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం మరిచిపోవద్దని విజ్ఞప్తి చేశారు. వైద్య సిబ్బంది కఠోర శ్రమవల్లే 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని చెప్పారు. 11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్‌ ఉద్యమం కొనసాగుతోందన్నారు.