New Delhi, March, 09: వచ్చే గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ (Loksabha Elections) విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జమ్ముకశ్మీర్‌కు (Jammu Kashmir) వెళ్లనుంది. సోమవారం నుంచి బుధవారం కేంద్ర ఎన్నికల బృందం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనుంది. బుధవారం జమ్ముకశ్మీర్ పర్యటన ముగియగానే గురు లేదా శుక్రవారం ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను (Loksabha Elections) విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. దాంతో జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కూడా సాధ్యమో కాదో పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు కేంద్ర ఎన్నికల సంఘం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనుంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతోనే దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ (Election Code) అమల్లోకి రానుంది. కాబట్టి పార్టీలు, ప్రభుత్వాలు హామీలు ఇవ్వడంగానీ, ప్రాజెక్టులు ప్రారంభించడంగానీ ఈలోపే యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాల్సి ఉంటుంది. కాగా జమ్ముకశ్మీర్లో చివరగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత కేంద్రం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసింది. రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లఢఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.
అయితే, ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ కుప్పలుతెప్పలుగా దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు గత ఏడాది డిసెంబర్ విచారణ జరిపింది. జమ్ముకశ్మీర్‌లో 2024 సెప్టెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అదేవిధంగా సాధ్యమైనంత త్వరగా జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పించాలని కేంద్రానికి సూచించింది.