Mumbai, October 24: ఎన్నికల మినీ సమరంలో హీరో ఎవరో, జీరో ఎవరో తేలే ఘడియలు వచ్చేశాయి. ఈ నెల 21న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభకు అలాగే దేశ వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలకు అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి ఈ రోజు ఫలితాలు వెలువడనున్నాయి. కాగా ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ ల స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. అయితే ఈ వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు చివరగా జరగనుంది. ఇప్పటికే ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ కూడా మేమే అధికారంలోకి వస్తామనే ధీమాలో ఉంది. ఓటరు ఎటు వైపు మొగ్గు చూపాడనేది సాయంత్రం తర్వాతనే తెలుస్తుంది.
ఇక తెలంగాణలోని హుజుర్‌నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక ఫలితం కూడా ఈ రోజు వెలువడనుంది. ఇక్కడ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. అయితే ఫలితం మాత్రం టీఆర్ఎస్ వైపే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ సారథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డినట్లుగా ఈ మధ్య పరిణామాలు తెలియజేస్తున్నాయి. సమ్మె కొనసాగుతన్నప్పటికీ తెలంగాణా సీఎం కేసీఆర్ చూపంతా హుజూర్ నగర్ మీదనే ఉందని తెలుస్తోంది. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ గెలుపు మాదే అనే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి జెండా ఎగరవేస్తుందని చెబుతున్నారు. ఓటరు తీర్పు ఎటు ఉంటుందనేది ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.