(Photo Credits: Twitter)

మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి చెందినట్లు మావోయిస్టు వర్గాలు తెలిపాయి ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. గత నెల 31వ తేదీన గుండెపోటుతో కటకం సుదర్శన్ మృతి చెందినట్లు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న కటకం సుదర్శన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. తెలంగాణలోని బెల్లంపల్లిలో ఓ కార్మిక కుటుంబంలో కటకం సుదర్శన్ జన్మించారు. వరంగల్‌లో పాలిటెక్నిక్ కళాశాలలో ఆయన చదివారు. 1974లో మైనింగ్ డిప్లోమా పూర్తిచేశారు. 1975లోనే రాడికల్ విద్యార్థి సంఘంలో కీలక పాత్ర పోషించారు. ఆ క్రమంలోనే సింగరేణి కార్మిక ఉద్యమంతో పాటు, రాడికల్ విద్యార్థి ఉద్యమాల్లో సుదర్శన్ చురుకైన పాత్ర పోషించారు.

1978లో లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతాల మావోయిస్టు పార్టీ ఆర్గనైజర్‌గా ఉద్యమాన్ని నడిపించారు. 1980లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, 1987లో దండకారణ్య ఫారెస్ట్ కమిటీలో కటకం సుదర్శన్ పని చేశారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కార్యదర్శిగా పనిచేశారు. 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా 2017లో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కటకం సుదర్శన్‌ గెరిల్లా పోరాటంలో దిట్ట. విప్లవ పోరాటంలో భాగంగా అసువులు బాసిన అమరవీరుడి జ్ఞాపకార్థం ఈనెల 5 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు సంతాప సభలు నిర్వహించాలని ప్రజలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.

కటకం సుదర్శన్ మృతి వార్తతో ఆయన గ్రామంలో విషాదఛాయల అలముకున్నాయి ఆయన స్నేహితులు, సన్నిహితులు అలాగే కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. పీడత ప్రజల తరపున పోరాటం చేసేందుకు తన జీవితాన్ని సైతం త్యాగం చేసి పోరుబాట పట్టాడు అని స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు.