Chennai, JAN 24: ఇంటి పనులు చేసే యువతిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి (DMK MLA Son) కొడుకు ఆంటో మథివాణన్, కోడలు మార్లినా అన్ పరారీలో ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాలుగు రోజుల క్రితమే వారిపై ఆరు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసిన నీలంకారై (Neelankarai Police) పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. వారిని అరెస్ట్ చేసేందుకు మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడులోని పల్లావరం నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు ఆంటో మథివాణన్ (Mathivanan), కోడలు మార్లినా అన్ తమ ఇంట్లో పని చేసే యువతిని వేధించినట్లు ఇటీవల నీలంకారై ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి వారిద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులిద్దరూ సైదాపేట కోర్టులో ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నట్లు సమాచారం.
ఇంటి పనులు చేస్తున్న యువతిని వారు తరచూ హింసించేవారని, వారితోపాటు ముంబైకి వెళ్లినప్పుడు వంట సరిగ్గా చేయలేదని కొట్టారని, పచ్చి మిరపకాయ తినిపించి హింసించారని, వాతలు పెట్టి రక్తం కారేలా కొట్టేవారని, మూడేళ్లు అక్కడే ఉండి పని చేయాలని బలవంతంగా సంతకం చేయించుకున్నారని, బయటకు వెళ్తే ఆమె తల్లిని ఏమైనా చేస్తామని బెదిరించారని, కులం పేరుతో తరచూ దూషించారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.