Haryana, April 28: చాలామంది పిల్లలు పెంపుడు జంతువులతో (Pets) ఎంతో అనుబంధం ఏర్పర్చుకుంటారు. వాటితో ఆడుతూ ఇంట్లో ఒకరిగా చూసుకుంటారు. అంతవరకు పరవాలేదు. కానీ కొందరు పిల్లలు పెంపుడు జంతువులపై మరీ ప్రేమ పెంచుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అనుకోనిది ఏదైనా జరిగి ఆ పెంపుడు జంతువు దూరమైతే పిల్లలు తట్టుకోలేరు. నిద్రాహారాలు కూడా మానేసి ఏడుస్తూ కూర్చుంటారు. వారిని తిరిగి మమూలు మనుషులను చేయడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. తాజాగా హర్యానాకు చెందిన పెంపుడు కుక్క మరణించిన బాధ భరించలేక మరింత తీవ్ర నిర్ణయం తీసుకుంది. దాదాపు ఐదు రోజులుగా నిద్రహారాలు మానేసి ఏడుస్తూ కూర్చున్న బాలిక చివరికి శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఉరేసుకుని (Suicide) చనిపోయింది.
తల్లి, సోదరి కిరాణా సరుకుల కోసం దుకాణానికి వెళ్లి వచ్చే లోపే దారుణానికి పాల్పడింది. మూడు నెలల క్రితం తాము ఒక కుక్కపిల్లను తెచ్చుకున్నామని, దాంతో తమ కూతురుకు మంచి అనుబంధం ఏర్పడిందని, రోజు దానితో ఆడుతుండేదని మృతురాలి తల్లి చెప్పింది. ఐదు రోజుల క్రితం ఆ కుక్కపిల్ల చనిపోవడంతో పాప తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యిందని, ఎప్పుడూ ఏడుస్తూ ముభావంగా కూర్చున్నదని, భోజనం కూడా సరిగా తినలేదని, కానీ ఇంటపని చేస్తుందని తాము ఊహించలేదని ఆమె విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.