Cloud Burst in Sikkim (PIC@ ANI X)

Gangtok, OCT 05: భారీ వర్షాలు, వరదలతో సిక్కిం (Sikkim) రాష్ట్రం వణికిపోతోంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ (Cloud Brust) కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో తీర ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 14 మంది పౌరులు మరణించారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 102 మంది గల్లంతయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. వారి ఆచూకీ కనిపెట్టేంందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరో 25 మంది క్షతగాత్రులు సహా వరదల్లో చిక్కుకున్న 45 మందిని రక్షించామని తెలిపాయి. సింగ్‌తామ్‌ వద్ద వరద ప్రవాహంలో మొత్తం 23 మంది ఆర్మీ (Army) జవాన్లు కొట్టుకుపోగా బుధవారం సాయంత్రం నాటికి ఓ సైనికుడిని సహాయక బృందాలు రక్షించాయి. రాష్ట్రంలో 14 వంతెనలు కూలిపోయాయి. వివిధ ప్రాంతాల్లో దాదాపు 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.

 

మంగళవారం అర్ధరాత్రి తర్వాత వరద బీభత్సం ప్రారంభమైంది. బుధవారం చుంగ్‌థాంగ్‌ డ్యామ్‌ (Chungdangh) నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత భీతావహంగా మారిందని తెలియజేశాయి. రాజధాని గాంగ్‌టక్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని సింగ్‌తామ్‌ ఉక్కు వంతెన బుధవారం తెల్లవారుజామున పూర్తిగా కొట్టుకుపోయిందంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. రహదారులపై రాకపోకలు స్తంభించాయి. సిక్కిం రాష్ట్రాన్ని దేశంలోని ఇతర భూభాగంతో అనుసంధానించే పదో నెంబర్‌ జాతీయ రహదారి పలుచోట్ల పూర్తిగా ధ్వంసమైంది.

 

వర్షాలు, వరద విలయాన్ని సిక్కిం ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. మాంగాన్, గాంగ్‌టక్, పాక్‌యోంగ్, నామ్చీ జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 8 దాకా సెలవు ప్రకటించింది. ఉత్తర బెంగాల్‌కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. తీస్తా నది ప్రవాహ ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చుంగ్‌తాంగ్‌లోని తీస్తా స్టేజ్ 3 డ్యామ్‌ వద్ద పనిచేస్తున్న దాదాపు 14 మంది కార్మికులు ఇప్పటికీ టన్నెల్‌లో చిక్కుకొని ఉన్నారు. చుంగ్‌తాగ్, ఉత్తర సిక్కింలో చాలా వరకు మొబైల్ నెట్‌వర్క్‌లు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లకు అంతరాయం ఏర్పడింది.. చుంగ్తాంగ్‌లోని పోలీస్ స్టేషన్‌ కూడా ధ్వంసం అయ్యింది.