Jaipur November 21: రాజస్థాన్ కేబినెట్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. సీఎం అశోక్ గెహ్లాట్ మినహా పాత మంత్రులంతా శనివారం రాజీనామా చేయడంతో…వారి స్థానంలో కొత్తవారికి చోటు లభించింది. 15 మంది కొత్త మంత్రులతో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేశారు సీఎం అశోక్ గెహ్లాట్. అందులో 11 మందిని కేబినెట్ హోదాలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ పదిహేను మంది నూతన మంత్రుల చేత రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు. జైపూర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
గెహ్లాట్ కొత్త టీంలో నలుగురు ఎస్సీలు ఉండగా, ముగ్గురు మహిళలు ఉన్నారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు చోటు కల్పించామన్నారు సీఎం అశోక్ గెహ్లాట్. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. కొత్తగా రాజస్థాన్ మంత్రివర్గంలో చేరిన వారిలో హేమంత్ చౌదరి, గోవింద్ రామ్ మేఘ్వాల్, శకుంతల రావత్, బ్రిజేంద్ర సింగ్ ఓలా, మురారీలాల్ మీనా, రమేశ్ మీనా, మమతా భూపేష్ బైర్వా, భజన్‌లాల్ జాతవ్, తీకారామ్ జూలీ, మహేంద్రజీత్‌సింగ్ మాల్వీయ, రామ్‌లాల్ జాట్, మహేష్ జోషి, విశ్వేంద్రసింగ్, రాజేంద్ర గడ్డా, జహీదా ఖాన్ ఉన్నారు.
Jaipur: Govind Ram Meghwal and Shakuntala Rawat take oath as Cabinet ministers in Rajasthan Govt
Brijendra Singh Ola and Murari Lal Meena sworn in as ministers of state in the Cabinet pic.twitter.com/4qbctuxVkd
— ANI (@ANI) November 21, 2021
రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల కోసం కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. కొత్త మంత్రివర్గంలో సచిన్ పైలెట్ వర్గానికి చెందిన 5గురికి చోటు లభించింది. దాంతో ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది సీఎం అశోక్ గెహ్లాట్‌పై బహిరంగంగా తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్….కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానంతో వరుస చర్చలు జరిపారు. మరో 22 నెలల్లో రాజస్థాన్‌లో ఎన్నికలున్నాయి. దాంతో ముందస్తుగా పార్టీని బలోపేతం చేయడం కోసం పునర్ వ్యవస్థీకరణ చేసినట్లు తెలుస్తోంది.