KSRTC Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ, 20 మంది ప్రయాణికుల దుర్మరణం, మరో 22 మందికి గాయాలు, ప్రమాదం పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి
amil Nadu bus accident (Photo Credits: ANI)

Coimbatore, February 20:  తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా, అవినాషి పట్టణానికి సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, మరో 22 మందికి గాయాలయ్యాయి. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) కి  చెందిన ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం (Accident) జరిగింది.

బుధవారం రాత్రి 48 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి బయలుదేరిన వోల్వో బస్సును గురువారం ఉదయం 3 గంటల సమయంలో తిరుప్పూరు జిల్లాలో (Tirupur District)  ఎదురుగా వచ్చిన ఓ భారీ కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ సహా బస్సులో ప్రయాణిస్తున్న  10 మంది స్పాట్ లోనే చనిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరికొంత మంది చనిపోయారని తెలిసింది. కంటైనర్ టైర్లు పగిలిపోవడంతోనే అదుపుతప్పి బస్సును ఢీకొట్టినట్లు చెబుతున్నారు.

మృతుల్లో 14 మంది పురుషులు, 5 మంది మహిళలు ఉన్నట్లు అవినాషి డిప్యూటీ తహశీల్దార్ పేర్కొన్నారు. క్షతగాత్రులను తిరుప్పూర్, కోయంబత్తూర్ ఆసుపత్రులకు తరలించారు.

Check ANI update:

ఇక ఈ ప్రమాదం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (CM Pinarayi Vijayan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని సమీప జిల్లాల అధికారులను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ సహకారంతో సాధ్యమయ్యే అన్నిరకాల సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ సీఎంఓ ప్రకటించింది.