Uttar Pradesh Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్న రెండు ట్రక్కులు, 23 మంది వలస కార్మికుల దుర్మరణం, మరికొంత మందికి తీవ్ర గాయాలు
Accident in Uttar Pradesh's Aurraiyya district (Photo Credits: ANI)

Aurraiyya, May 16: ఉత్తర ప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో శనివారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలస కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కు, ఎదురుగా వస్తున్న మరో ట్రక్కు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇరవై నాలుగు మంది వలస కార్మికులు మరణించారు, మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా అధికారులు గుర్తించారు.

COVID-19 సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయిన ఎంతో మంది వలస కార్మికులు, లాక్డౌన్ లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో చేసేదేం లేక తమ స్వగ్రామాలకు పయనమవుతున్నారు. కొంతమంది కాలిబాటన, మరికొంత మంది ఏదో ఒక వాహనం పట్టుకొని ఎలాగో అలా ఇల్లు చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలోనే కొంతమంది ప్రాణాలు కోల్పోయే దురదృష్ట సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.

ANI Update:

ఇటీవల మహారాష్ట్రలో కాలిబాటన పయనిస్తూ అలసిపోయి మార్గమధ్యంలో ఒక రైల్వే ట్రాక్ పై నిద్రిస్తుండగా వారిపై నుండి గూడ్స్ రైలు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ దిగ్భ్రాంతికరమైన ఘటనలో 16 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తిండి లేక, నీరులేక ఎండలకు తాళలకు చనిపోతున్న వారున్నారు.

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోలాక్డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖ అధ్వర్యంలో ప్రత్యేక 'శ్రామిక్ రైళ్లను' నడుపుతోంది. అంతేకాకుండా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వీరి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా ప్రారంభించింది. వలస కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో నడిచి వెళ్లకుండా వారి ప్రయాణాలకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది.