Image used for representational purpose | (Photo Credits: PTI)

ది కాశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files).. మన దేశంలో ఇప్పుడీ మూవీ ఓ సంచలనం. అయితే సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సినిమా చూస్తున్న వారిపై కొన్ని ప్రాంతాల్లో దాడులు కూడా చేస్తున్నారు. ఇటీవల యూపీ (Uttar Pradesh) లోని ఖుషీనగర్‌లో ముగ్గురు వ్యక్తులపై దుండుగులు దాడి చేశారు. ఐతే కాశ్మీర్ ఫైల్స్ మూవీ సినిమా వివాదంలో ముగ్గురు యువకులపై కత్తితో దాడి చేసిన ముఠాపై తాజాగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. మరో ఇద్దరు తప్పించుకున్నారు.

వివరాల్లోకి వెళితే మార్చి 18న ఫాజిల్‌నగర్ పట్టణంలోని ఓ థియేటర్ వద్ద కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులను దండుగులు కత్తితో పొడిచి పారిపోయారు. దీంతో మైనుద్దీన్, జైనుద్దీన్ అలియాస్ గోగా, రాజా ఖర్వార్, అనీష్ అనే నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే మైనుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అతడి అరెస్ట్ తర్వాత మిగతా ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. తప్పించుకున్న ముగ్గురిలో ఒకరైన జైనుద్దీన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి దమ్ముంటే అరెస్టు చేయండంటూ విసిరిన సవాల్ వైరల్‌గా మారింది. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

RIP Abhishek Chatterjee: చిత్ర పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు అభిషేక్ ఛటర్జీ గుండెపోటుతో కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన సీఎం దీదీ

కాగా గురువారం సోన్‌బర్సా పట్టి సమీపంలో పోలీసుల బృందానికి జైనుద్దీన్, రాజా ఖర్వార్, అనీష్ తారసపడ్డారు. వారు బైక్‌పై పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో జైనుద్దీన్ తుపాకీ తీసి... పోలీసులపై కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో జైనుద్దీన్‌ కాలికి గాయాలు కావడంతో అక్కడే పడిపోయాడు. చీకట్లో మిగతా ఇద్దరు పారిపోయారు. పోలీసులు వెంబడించినప్పటికీ దొరకలేదు. ఐతే గాయపడిన జైనుద్దీన్‌ను మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి నాటు తుపాకీ, కాల్చిన బుల్లెట్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కాల్పుల్లో ఫాజిల్ నగర్ ఔట్ పోస్ట్ ఇంచార్జి అలోక్ యాదవ్‌కు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఫాజిల్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోగా కూడా అక్కడే ఉన్నాడు. అతడి నుంచి మిగతా ఇద్దరి నిందితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ గ్యాంగ్ గతంలోనూ పలు నేరాలను పాల్పడినట్లు గుర్తించారు. అందుకే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు.